ఒంటేరుకు కేసీఆర్ వ‌రాలు ఇవేనా?

Update: 2019-01-18 05:11 GMT
ప్ర‌త్య‌ర్థులు లేని రాజ‌కీయంలో ఎలాంటి మ‌జా ఉండ‌దు. వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు లేని వైనం క‌నిపించ‌దు. కానీ.. తెలంగాణ‌లో అలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. సీఎం కేసీఆర్ తో పోరాడేందుకు సిద్ధ‌మైన వారంతా ఇప్పుడు అందుకు భిన్నంగా గులాబీ కారెక్క‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ మ‌ధ్య జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి ప్ర‌చారంలో భాగంగా చేసిన వ్యాఖ్య‌ల్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. కేసీఆర్ ప‌ని అయిపోయింద‌ని.. ఆయ‌న ఓట‌మికి చేరువ‌గా ఉన్న‌ట్లుగా ఒంటేరు చెప్పేవారు. కొన్ని మీడియాల్లో అయితే.. కేసీఆర్‌ కు ఒంటేరు ట‌ఫ్ ఫైట్ ఇస్తున్న‌ట్లుగా వార్త‌లు అచ్చేశారు.

మీడియాలో వినిపించిన‌ పోటాపోటీకి.. వాస్త‌వం మాత్రం భిన్నంగా ఉంద‌న్న విష‌యం గ‌జ్వేల్ ఫ‌లితం స్ప‌ష్టం చేసింది.తీవ్ర పోటీ నేప‌థ్యంలో త‌క్కువ మెజార్టీతో కేసీఆర్ బ‌య‌ట‌ప‌డొచ్చ‌న్న అంచ‌నాల‌కు భిన్నంగా ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. భారీ మెజార్టీతో కేసీఆర్ గెలుపొందారు. కేసీఆర్ మీద ఒంట‌రిగా పోరాడుతున్న ఓంటేరుకు మ‌రోసారి ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కేసీఆర్ మీద ఘాటు విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న‌.. ఉన్న‌ట్లుండి గులాబీ కారు ఎక్కేందుకు రెడీ కావ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

టీడీపీ ఉనికి తెలంగాణ‌లో ఉండ‌కూడ‌ద‌న్న పంతంతో ఉన్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే పావులు క‌దుపుతున్న వైనం తెలిసిందే. మ‌రోవైపు .. కాంగ్రెస్‌ కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌తో పాటు.. బ‌ల‌మైన నేత‌ల్ని పార్టీలోకి ఆహ్వానించ‌టం ద్వారా త‌న‌ను.. త‌న పార్టీకి వ్య‌తిరేకంగా పోరాడే వారన్న‌దే లేన‌ట్లుగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్న‌ట్లుగా చెప్పాలి.

మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఒంటేరు కారెక్కుతున్న వైనం వెనుక ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఒంటేరు గులాబీ పార్టీలో చేరుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప్యాకేజీని ఘ‌నంగా ఇచ్చేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఒంటేరును ఎమ్మెల్సీగా ఎంపిక చేయ‌టంతో పాటు.. పార్టీలోనూ స‌ముచిత స్థానం ఇచ్చేందుకు కేసీఆర్ ఓకే అన్న‌ట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. కేసీఆర్ కానీ జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి పెట్టి.. ఎంపీగా ఎన్నికైతే.. ఖాళీ అయ్యే గ‌జ్వేల్ స్థానాన్ని ఒంటేరుకు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీరుస్తూ.. కారెక్కేందుకు సాద‌రంగా ఆహ్వానం ప‌లికితే ఒంటేరు ఏంది.. ఎవ‌రైనా కారెక్కెస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Full View

Tags:    

Similar News