శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లటం పక్కానే

Update: 2015-10-18 05:24 GMT
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లటం అధికారికంగా ఖరారైనట్లే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తనకు ఆహ్వానపత్రం అందకముందే.. కేసీఆర్ తన హాజరు పక్కా అన్న విషయాన్ని తేల్చేశారు. ఆదివారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి.. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు.

అయితే.. దీనికి దాదాపు రోజు ముందే అమరావతికి వెళ్లాలన్న అంశంపై కేసీఆర్ తుది నిర్ణయం తీసేసుకున్నారు. శంకుస్థాపన మహోత్సవానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన టూర్ షెడ్యూల్ ను కేసీఆర్ ఖరారు చేయటం గమనార్హం. శంకుస్థాపన దినోత్సవం రోజున తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపడుతున్నా.. వాటిని ముందుగా జరిపి.. అందులో పాల్గొని.. శంకుస్థాపనకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించటం విశేషం.

కేసీఆర్ కలల ప్రాజెక్టులలో ఒకటైన డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహప్రవేశాలకు సంబంధించి ఈ నెల 22న సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న అనంతరం.. మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో కూడా కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం సూర్యాపేట నుంచి ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపనకు వెళ్లనున్నారు. తాజాగా ఖరారు చేసిన షెడ్యూల్ తో కేసీఆర్ హాజరు మీద ఉత్కంట తొలిగిపోయినట్లేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News