గూర్ఖాల్యాండ్ పై కేసీఆర్ చెప్పిన మాట‌ల్ని విన్నారా?

Update: 2017-08-03 04:31 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరు విన్న వెంట‌నే.. ఆయ‌న‌లోని ఉద్య‌మ‌నేత చ‌టుక్కున గుర్తుకు వ‌స్తారు. ఆయ‌న సైతం.. తాను మాట్లాడే ప‌ది మాట‌ల్లో క‌నీసం ఒక‌ట్రెండు సార్లు అయినా.. త‌న ఉద్య‌మ నేప‌థ్యాన్ని ప్ర‌స్తావించ‌కుండా వ‌దిలిపెట్టారు. మ‌రి.. అలాంటి ఉద్య‌మ నేత‌.. దేశంలో మ‌రో రాష్ట్ర ఏర్పాటు కోసం తీవ్రంగా సాగుతున్న పోరాటం మీద ఎలా రియాక్ట్ అయ్యారు? అన్న‌ది చూసిన‌ప్పుడు ఆస‌క్తిక‌రంగా అనిపించ‌కమాన‌దు.

ఓప‌క్క గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుపై కేసీఆర్ తో క‌లిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మించిన కోదండ‌రాం లాంటోళ్లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ మాత్రం మ‌రో తీరులో రియాక్ట్ కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మీడియా ప్ర‌తినిధుల‌తో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్‌.. గూర్ఖాల్యాండ్ అంశంపైన త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. గూర్ఖాల్యాండ్ స‌మ‌స్య చాలా ఏళ్లుగా ఉంద‌ని.. ప్ర‌త్యేక రాష్ట్రం ఇవ్వ‌టానికి అక్క‌డ సున్నిత అంశాలు ఉన్నాయ‌ని కేంద్రం.. ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం చెబుతుంద‌న్నారు.

అది చికెన్ నెక్ ప్రాంత‌మ‌ని.. చైనా స‌రిహ‌ద్దుల్లో ఉంద‌న్నారు. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల్లో చైనా కిరికిరి పెడుతోంద‌ని.. చికెన్ నెక్ ప్రాంతంలో చైనా ప్రాబ‌ల్యంలోకి పోతే.. ఈశాన్య ప్రాంతం ప‌రిస్థితి దారుణంగా మారుతుంద‌న్నారు. ఇప్పుడు గూర్ఖాల్యాండ్ లో హ‌ఠాత్తుగా కొట్లాడుతున్న‌రంటే చైనా పాత్ర ఉందేమోన‌న్న అనుమానాలు వ‌స్తున్నాయ‌న్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో గూర్ఖాల్యాండ్ స‌మ‌స్య‌పై వ్య‌క్తిగా త‌న అభిప్రాయం చెప్ప‌టం కుద‌ర‌ద‌ని.. ఇందులో డీప్ గా వెళ్తే చాలా స‌మ‌స్య‌లున్నాయ‌న్నారు. వైఖ‌రి చెప్పాల్సి వ‌స్తే.. పార్టీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.
ఒక ఉద్య‌మ రాజ‌కీయ నేత‌.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలు ప‌ణంగా పెట్టిన‌ట్లుగా చెప్పుకునే వ్య‌క్తి.. దేశంలో మ‌రో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న వైనంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయ‌ని చెప్పాలి. త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం చెప్ప‌నంటూనే.. చైనా పాత్ర‌పై సందేహం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర పోరాటం వెనుక కూడా ఏవో శ‌క్తులు ఉన్నాయ‌న్న ప్ర‌చారం జ‌రిగితే.. దానిపై ఒంటికాలి మీద విరుచుకుప‌డిన కేసీఆర్‌.. ఈ రోజు మ‌రో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం సాగుతున్న పోరాటం మీద మాత్రం అందుకు భిన్న త‌ర‌హాను ప్ర‌ద‌ర్శించ‌టం విశేషంగా చెప్పాలి. మేధావిగా.. ఏ విష‌యం మీద‌నైనా పూర్తి అవ‌గాహ‌న తెచ్చుకునే వ్య‌క్తిగా పేరున్న కేసీఆర్‌.. గూర్ఖాల్యాండ్ గురించి దృష్టి సారించ‌లేదా? పుస్త‌కాలు చ‌ద‌వ‌లేదా? అన్న సందేహాలు రావ‌టం ఖాయం.
Tags:    

Similar News