కేసీఆర్ సిగ్గుతో తలదించుకున్నారట

Update: 2019-04-09 05:04 GMT
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి మాటలు విన్నంతనే మనసు పులకరించిపోతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనసు తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటుంది. ఇంత ఫీల్ ఇచ్చేలా మాట్లాడే అధినేత తెలుగు ప్రజలకు దొరకటం తెలుగు ప్రజలు నిజంగా లక్కీ ఫెలోస్ గా చెప్పాలి. ప్రత్యర్థులను తాట తీసేలా తిట్టేసే కేసీఆర్.. కొన్ని సందర్భాల్లో తనను తాను తిట్టుకుంటారు.

కొందరి కారణంగా తాను ఎలా ఫీల్ అయ్యిందన్న విషయాన్ని చెప్పి.. అయ్యో కేసీఆర్ కు ఎంత కష్టం వచ్చిందన్న భావనను కలుగచేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతాన్ని చెప్పారు కేసీఆర్. ఒక సామాన్యుడు తన ఫోన్ కు పంపిన ఒక మేసేజ్ చదివితే.. సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. సామాన్యుడికి సీఎం కేసీఆర్ చూసే ఫోన్ నెంబర్ ను ఎలా సేకరించారన్న అనవసరమైన సందేహాల్ని మనసులోకి రానివ్వకుండా చదవితే బాగుంటుంది.

అవినీతిపై తనకు రోజు వేలకు వేల ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్.. భువనగిరి నుంచి ఒక డాక్టర్ పంపిన మెసేజ్  తనను ఎంతలా ప్రభావితం చేసిందో చెప్పారు. ఇలాంటి వాటిని కేసీఆర్ మాటల్లో చదవాలే కానీ.. మరొకరు చెప్పినట్లుగా చదివితే కిక్కు ఉండదు.అందుకే.. కేసీఆర్ మాటల్ని యథాతధంగా చదివితే..

 ‘‘డాక్టర్‌ శ్రీనివాస్‌ అనే ఒకాయన భువనగిరి నుంచి నాకు ఓ ఎస్ ఎంఎస్‌ ఇచ్చాడు. ఆయన ఏ కార్యాలయాలకు పోయాడో చెప్పను. కానీ, రెండు కార్యాలయాలకు పోయాడట. రెండు కార్యాలయాల్లోనూ రూ.30 వేల చొప్పున లంచం తీసుకున్నారట. లంచం ఇవ్వకపోతే పని చేయమన్నారట. దిక్కు లేక లంచం ఇచ్చానన్నాడు. ఇంత పెద్ద పాపులర్‌ ముఖ్యమంత్రివి.. ఇంత పెద్ద కేసీఆర్‌ వి ఉండి కూడా నువ్వు నివారించలేవా..?, నీకు చేతకాదా..? అని ప్రశ్నించాడు. నేను సిగ్గుతో తలదించుకున్నా’’ అని కేసీఆర్‌ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

డాక్టర్ గారి నుంచి వచ్చిన మెసేజ్ తో కేసీఆర్ లో మధనం మొదలై.. చివరకు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవటానికి ఆయన సిద్ధమైనట్లుగా చెప్పారు. అవినీతి ఇంత విచ్చలవిడిగా ఉండడానికి వీల్లేదని, దీన్ని నిర్మూలించాలని కఠిన నిర్ణయం తీసుకున్నామని, వంద శాతం మున్సిపాలిటీలు, పంచాయతీలు, రెవెన్యూలో ఊరట లభించేలా కొత్త చట్టాలు తెస్తున్నామన్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే తర్వాత పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయన్నారు. ఓహో.. చట్టం మారుస్తామన్న మాటను సూటిగా చెప్పే కన్నా.. కేసీఆర్ స్టైల్లో చెబితే ఎంత ఎఫెక్టివ్ గా ఉందో గమనించారా? 
Tags:    

Similar News