మంత్రిని ‘నువ్వు’ అనటం ఎంత తప్పో చెప్పిన కేసీఆర్

Update: 2020-03-08 05:30 GMT
వినేటోళ్లు ఉంటే చెప్పేటోళ్లు చెలరేగిపోతారని ఊరికే అనలేదేమో? తాజాగా తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విన్నోళ్లంతా అవాక్కు అయ్యే పరిస్థితి. తనను..తన ప్రభుత్వ పని తీరును తీవ్రంగా తప్పు పట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ఉద్దేశించి ఆయన తీవ్రంగా రియాక్ట్ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు.

అన్నింటికి మించి.. మాటల్లో ‘మీరు’.. ‘నువ్వు’ అనే మాటలకు తానిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని చెప్పటమే కాదు.. కొన్ని సందర్భాల్లో పిలుపుల్ని తానెంత సీరియస్ గా తీసుకుంటానన్నది చెప్పేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. బహిరంగ సభల్లోనే ప్రధానమంత్రిని పట్టుకొని ఏకవచనంతో విరుచుకుపడటమే కాదు.. కొన్ని మాటలు అనటం అప్పట్లో అందరిని షాక్ కు గురి చేసింది.

అలాంటి చరిత్రను కేసీఆర్ తాజాగా మర్చిపోయినట్లున్నారు. తమ మంత్రులను ఉద్దేశించి.. విపక్ష నేతలు ‘నువ్వు’ అన్న పద ప్రయోగం చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘ఎవరిని పడితే వారిని.. మినిస్టర్లను సైతం నువ్వు అంటాడు. పది మందిని తిట్టాడు. మేం లేస్తే నశానికి కూడా మిగలడు కదా?’ అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఒకరు నోరు పారేసుకుంటే.. అంతే తీవ్రంగా తాను సైతం మాటల చురుకుదనాన్ని ప్రదర్శించారన్న విషయాన్ని కేసీఆర్ విస్మరించిన పద్దతి చూస్తే.. ఆయన మాటల చాతుర్యానికి అవాక్కు అవ్వాల్సిందే. ఎవరిని పడితే వారిని.. ఏ స్థాయికి చెందిన వారిని అయినా తనకు తోచినట్లుగా అనేసే అలవాటు ఉన్న కేసీఆర్ లాంటి అధినేత.. సంబోధనల విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవటమా?
Tags:    

Similar News