సింగరేణిలోనూ ఆర్టీసీ ఫార్ములా?

Update: 2019-12-02 08:45 GMT
చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఆర్టీసీ కార్మికులు చేసిన 52 రోజుల సమ్మె.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ఆదివారం ప్రగతిభవన్ లో ఆర్టీసీ కార్మికులతో విందు భోజనాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? కేసీఆర్ అనుకోవాలే కానీ.. ఏమైనా చేస్తారని ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆర్టీసీలో యూనియన్లకు చెక్ చెప్పటమే కాదు.. సంఘాలు ఉంటే తమ సంక్షేమం ఉండదన్న భావన ఉద్యోగుల్లో కలుగజేసే విషయంలో కేసీఆర్ నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారని చెప్పాలి.

మొన్నటివరకు తిట్టి.. శాపనార్థాలు పెట్టిన నోళ్లే ఈ రోజున పొగిడేస్తున్నాయి. ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్టీసీలో ఎలా అయితే కార్మిక సంఘాలు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారో అదే రీతిలో సింగరేనిలోనూ యూనియన్లు వద్దనే దిశగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ వ్యూహంలో భాగంగా సింగరేణిలో టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండే టీబీజీకేఎస్ సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్న హరీశ్ రావు.. కవితలు ఇటీవల తమ పదవులకు రాజీనామా చేశారు. ఉన్నట్లుండి ఈ సంఘాలకువారు రాజీనామా చేయటం ఎందుకన్నది అర్థం కాలేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే కానీ అసలు విషయం అర్థం కాని పరిస్థితి.

కేంద్ర కార్మిక కమిషన్ జారీ చేసిన సర్టిఫికేట్ ప్రకారం సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితి శనివారంతో ముగిసింది. అదే సమయంలో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండేళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు నిర్వహించకూడదన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు అన్నవి ఉండకూడదన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఈ విషయాన్ని ప్రజలకు సమాచారం అందించటానికి కొన్ని నెలల ముందే వ్యూహాత్మకంగా హరీశ్.. కవితల చేత రాజీనామా చేయించినట్లుగా చెబుతున్నారు. మరి.. గుర్తింపు సంఘం కాలపరిమితిని పెంచటమా? లేదంటే కొత్తగా ఎన్నికలు నిర్వహించటమా? అన్నది తేల్లేదు. రాజకీయంగా తనను ప్రభావితం చేసే బలమైన యూనియన్లు ఏవీ మనుగడలో ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదన్న మాట వినిపిస్తోంది. తాజా పరిణామాలన్ని ఈ వాదనను బలపర్చేలా ఉండటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసినట్లు అవుతుందంటున్నారు.


Tags:    

Similar News