జ‌నాల రియాక్ష‌న్ తో కేసీఆర్ ఫుల్ ఖుషీ

Update: 2018-05-11 05:23 GMT
కోపం వ‌స్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయినోళ్లు.. కానోళ్లు అన్న తేడా లేకుండా ఇర‌గ‌దీయ‌టం కేసీఆర్‌ కు అల‌వాటే. అందుకే ఆయ‌న‌కు కోపం వ‌చ్చిందంటే చాలు వ‌ణికిపోతారు. చివ‌ర‌కు కేసీఆర్ పిల్ల‌లు సైతం ఆయ‌న కోపాన్ని త‌ట్టుకోలేర‌ని చెబుతారు. మ‌రి.. అలాంటి కేసీఆర్ ఖుషీగా ఉంటే ఎలా ఉంటారు?  ఊహించిన దాని కంటే ఎక్కువ స‌క్సెస్ త‌న ద‌రికి వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?  ఆయ‌న మాట‌లు ఎలా మార‌తాయి?  లాంటి ప్ర‌శ్న‌ల‌కు తాజాగా ఉదంతం ఒక‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గేమ్ ఛేంజ‌ర్ గా మారుతుంద‌న్న ఆశ పెట్టుకున్న కేసీఆర్ భారీ ప‌థ‌కం రైతుబంధును షురూ చేసిన వైనం తెలిసిందే. ఏడాదికి రూ.12వేల కోట్ల‌తో ఎక‌రం పొలం ఉన్న వారికి రూ.8వేలు చొప్పున రైతుల‌కు నేరుగా సాయం చేయ‌టం ఈ ప‌థ‌కం ప్ర‌త్యేక‌త‌. ఏడాదికి రెండు పంట‌లు వేసుకుంటే.. రెండుసార్లు ఈ మొత్తాన్ని ఇవ్వ‌నున్నారు.

దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ఈ ప‌థ‌కాన్ని తామే స్టార్ట్ చేసిన‌ట్లుగా సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే పెద్ద ఎత్తున యాడ్స్ ఇవ్వ‌టం తెలిసిందే. రైతుబంధు ప‌థ‌కాన్ని త‌న చేతుల మీద స్టార్ట్ చేసేందుకు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు వెళ్లారు కేసీఆర్‌. ఈ సంద‌ర్భంగా దారి పొడుగునా.. త‌మ‌కు స్వాగ‌తం పలికేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రోడ్ల మీద నిల‌బ‌డి ఉండ‌టం.. కొన్నిచోట్ల కేసీఆర్ ప్ర‌యాణిస్తున్న బ‌స్సు మీద పూల‌వ‌ర్షం కురిపించ‌టంతో కేసీఆర్ సంతోషానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

త‌న మ‌న‌సులోని సంతోషాన్ని దాచుకోని కేసీఆర్‌.. బ‌స్సులో త‌న ప‌క్క‌నే కూర్చున్న సీఎస్ తో త‌న మ‌నోభావాల్ని పంచుకున్నారు. చూసిండ్రా సీఎస్ గారు.. ప్ర‌జ‌లు ఎంత సంతోషంగా ఉన్నారో.. మ‌నం మంచి ప‌ని ఏస్తే ఇంత సంతోషంగా ఉంటారంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్ర‌యాణించిన బ‌స్సులో సీఎస్ తో పాటు..ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు..  ఉన్న‌తాధికారులు బ‌య‌లుదేరారు.

రైతుబంధు ప‌థ‌కాన్ని స్టార్ట్ చేయ‌టానికి వ‌చ్చిన కేసీఆర్ కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌క‌టానికి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పోటెత్తారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై పూల‌వ‌ర్షాన్ని ప‌లుచోట్ల కురిపించారు. ఆశ కార్య‌క‌ర్త‌లు.. మ‌హిళ‌లు.. వ్యాపారులు.. ప్ర‌జ‌లు.. ఇలా పలు వ‌ర్గాల‌కు చెందిన వారు గుంపులు గుంపులుగా రోడ్ల ప‌క్క‌న నిలిచి సీఎం కేసీఆర్ కు స్వాగ‌తం ప‌లికారు.

ప్ర‌జ‌ల సంతోషాన్ని.. కేరింత‌ల్ని స్వ‌యంగా చూసిన కేసీఆర్ హ్యాపీగా ఫీల‌య్యారు. త‌న సంతోషాన్ని ప‌లువురితో ఆయ‌న పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా తాము షురూ చేసిన ప‌థ‌కం సూప‌ర్ హిట్ అయ్యింద‌న్న మాట సీఎం కేసీఆర్ నోట వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News