ప్రగతి భవన్ లో ఏం జరుగుతోంది?

Update: 2022-01-15 02:34 GMT
దూకుడు ప్రదర్శిస్తున్న విపక్షాలు ఒక పక్క.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి.. గడిచిన ఏడేళ్లలో ఎప్పుడూ ఎదుర్కొనని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. కేంద్రంలోని మోడీ సర్కారు మీద కత్తి కట్టిన ఆయన.. ఒక పద్దతి ప్రకారం.. జాతీయ స్థాయిలోని పార్టీలతో టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు వేసుకొని వెళ్లి.. రాష్ట్రాధినేతలు కొందరిని కలిసినా పెద్దగా ప్రయోజనం లేని వేళ.. అందుకు భిన్నంగా ఇప్పుడు తన ప్రగతిభవన్ కు పిలిపించుకొని కొందరితో జరుపుతున్న మంతనాలు రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

గత వారంలో చూస్తే.. కమ్యునిస్టు అగ్రనేతలు హాజరుకావటమే కాదు.. కేరళ ముఖ్యమంత్రి సైతం కేసీఆర్ తో భేటీ కావటం ఇప్పుడు ఆసక్తికరంగామారింది.ఆ  మాటకు వస్తే.. ఈ భేటీ రాజకీయంగా కేసీఆర్ కు మంచి మైలేజీని తెచ్చి పెట్టింది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీకి సంబంధించిన వివరాల్ని పేర్కొంటూ కేరళ సీఎం పినరయి విజయన్ ఒక ట్వీట్ చేశారు. అందులో.. ''ఏచూరితో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశాను. కేసీఆర్‌ ఆత్మీయ ఆహ్వానానికి కృతజ్ఞతలు. కేసీఆర్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయి''అని కేరళ సీఎం పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలనకు పేరున్న విజయన్ లాంటి అధినేత కేసీఆర్ తో భేటీ కావటం.. ఆయనతో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగినట్లుగా పేర్కొనటం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

సీపీఎం.. సీపీఐ జాతీయస్థాయి నేతలతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత బిహార్ లో బలమైన రాజకీయ శక్తిగా పేరున్న లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్జేడీ పార్టీలో కీలక నేతల్లో ఒకరైన లాలూ కుమారుడితోనూ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ సందర్భంలో లాలూతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరటం గమనార్హం. ఇలా ఒకరి తర్వాత ఒకరు చొప్పున భేటీ అవుతున్న తీరు చూస్తే.. కేసీఆర్ ఏదోకొత్త ప్లానింగ్ కు తెర తీశారని చెప్పాలి.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఏదైనా అంశంపై భారీ ప్లానింగ్ చేసేందుకు కేసీఆర్ కు ఎంతో ప్రీతిపాత్రమైన ఫామ్ హౌస్.. అదేనండి ఫార్మర్ హౌస్ వేదికగా సాగుతుంది. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ప్రగతి భవన్ వేదికగా సాగటం గమనార్హం. మరో కీలకమైన అంశం ఏమంటే.. ఏమాత్రం ఖాళీ దొరికినా.. ఫాంహౌస్ కు వెళ్లే సీఎం కేసీఆర్.. కొత్త సంవత్సరంలో చాలా ఎక్కువ రోజులు.. ఫాం హౌస్ కు దూరంగా ఉండటం.. పండక్కి కాస్త ముందుగా వెళ్లటం విశేషం. మొత్తానికి ఫాంహౌస్ కు వెళ్లకుండా.. ప్రగతిభవన్ లోనే కూర్చొని.. పలువురితో భేటీ అవుతున్న కేసీఆర్ తీరు చూస్తుంటే.. కచ్ఛితంగా ఏదో భారీ ప్లానింగ్ లో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News