కవిత కోసమే ఆ సీనియర్ నేతకు ఆ పదవిని కట్టబెట్టారా?

Update: 2021-09-19 04:40 GMT
రాజకీయాల్లో ఏవి ఉత్తినే చోటు చేసుకోవు. కంటికి కనిపించే పరిణామాల వెనుక.. అసలు లెక్కలు వేరుగా ఉంటాయి. అలాంటివి నిశితంగా చూసే వారికి తప్పించి.. మిగిలిన వారికి ఒక పట్టాన అర్థం కావు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. మాస్టర్ మైండ్ కేసీఆర్ ప్లానింగ్ ఒక పట్టాన అర్థం కాదు. ఎవరికి అర్థం కానట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. దాన్ని వెతుక్కుంటూ పోతే కానీ.. ఎక్కడో కానీ దాని లింకు కనిపించదు. తాజాగా ఒక సీనియర్ నేతకు అప్పజెప్పిన తాజా పదవిని చూస్తే.. రానున్న రోజుల్లో కొత్త సమీకరణాల దిశగా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్దన్ ను ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించటం తెలిసిందే. ఇంతకాలం ఆయన్ను ఖాళీగా ఉంచిన కేసీఆర్.. అనూహ్యంగా ఆయనకు ఆ పదవిని కట్టబెట్టటం వెనుక అసలు లెక్కలు వేరే అన్న మాట వినిపిస్తోంది. ఇదే జిల్లా నుంచి తన కుమార్తెను ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్.. త్వరలోనే ఆమెను మంత్రివర్గంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే.. జిల్లాకు చెందిన సీనియర్ నేత.. మంత్రి పదవికి అర్హత ఉన్న బాజిరెడ్డిని కాదని కవితకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే రానున్న రోజుల్లో కవితకు.. పార్టీకి అంతో ఇంతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే.. ఆయన మనసు నొప్పించకుండా.. ఆర్టీసీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మంత్రివర్గంలోకి కవితను తీసుకోవటానికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లుగా భావిస్తున్నారు.

అయితే.. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. పదవులన్ని ఫ్యామిలీ ప్యాక్ గా మారాయని.. కల్వకుంట్ల రాజరిక పాలనకు నిదర్శనంగా ఉందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి..

కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి.. మంత్రిగా కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ మంత్రిగా ఉండటమే కాదు.. కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి.. దగ్గర బంధువు సంతోష్ ను రాజ్యసభ సభ్యుడ్ని చేయటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన కవితను ఎమ్మెల్సీగా చేయటానికి కేసీఆర్ ప్రదర్శించిన తాపత్రయం ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. అలాంటిది ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవటం పెద్ద తప్పే అవుతుందంటున్నారు. మరి.. ఈ అంచనాలకు.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు లింకు ఎంతవరకు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News