కుర్చీ కోసం.. కొడుకు కోసమే కేసీఆర్ ఆ పనులన్ని చేస్తున్నారట

Update: 2021-08-20 03:55 GMT
ముందు వెనుకా చూసుకోకుండా విరుచుకుపడటం.. తమ ప్రత్యర్థుల్ని కడిగిపారేయటంలో దిట్టగా పేరున్న కిషన్ రెడ్డి.. గడిచిన కొద్దికాలంగా ఆయన స్వరం నెమ్మదించిందని.. ప్రశ్నించే తత్త్వం తగ్గినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక.. ఆయన రాజకీయ ప్రత్యర్థులైతే మరింత దూకుడుగా ఆయనపై ఘాటైన ఆరోపణలు చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే విషయంలో కిషన్ రెడ్డి వెనకుంటారని.. ఆయన తొందరపడరని.. మిగిలిన బీజేపీ నేతలు తిడుతుంటే.. ఆ సమూహంలో ఉంటారే కానీ.. చేసేది మాత్రం ఏమీ ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి కిషన్ రెడ్డి తాజాగా అందుకు భిన్నమైన రీతిలో రియాక్టు అయ్యారు. కేసీఆర్ ను ఘాటైన పదజాలంతో విమర్శించిన.. ఆయన.. తన కేంద్రపదవికి తగిన రీతిలో వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ప్రజా సమస్యలపై స్పందించేందుకు ప్రగతిభవన్ దాటేందుకు బయటకు రాని కేసీఆర్.. ప్రధాని మోడీని విమర్శించేందుకు మాత్రం ముందుంటారని మండిపడ్డారు. కుటుంబం కోసం కేసీఆర్ ఎంతకైనా దిగజారతారన్నారు. తెలంగాణను తాకట్టు పెట్టేందుకు సైతం ఆయన వెనుకాడరంటూ ఫైర్ అయ్యారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో నల్లబండ గూడెం నుంచి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి.. ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట.. కోదాడలో సభల్ని నిర్వహించిన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసి దుమ్ము దులిపేసేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కేవలం తన కుటుంబ సంక్షేమం కోసమే పని చేస్తున్నారని.. అమరుల ఆకాంక్ష మేరకు పాలన చేయటం లేదన్నారు.

ఎంతసేపటికి తన కుర్చీని కాపాడుకోవటం కోసం.. తన కొడుకును సీఎం చేయటానికి మాత్రమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ లో 12 మంది ఎస్సీలు ఉంటే.. 8 మంత్రి ఎస్టీలు ఉన్నారని.. 12 మంది బీసీలు మంత్రలుగా ఉన్నట్లు లెక్కలు చెప్పిన కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఈటల రాజేందర్ గెలుపును ఆపలేరన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర మంత్రుల్ని కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారన్నారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలన్నారు. రోటీన్ కు భిన్నంగా ఇంత ఘాటుగా సీఎం కేసీఆర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిట్టటం ఆసక్తికరంగా మారింది. మరి దీనికి గులాబీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.




Tags:    

Similar News