కేసీఆర్ 3.. ఇవాంక 5.. మోడీ 10

Update: 2017-11-28 07:00 GMT
ఈ పేర్లేంది.. దాని ప‌క్క‌నే అంకెలేంది? ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నుకోవ‌ద్దు. ఇక్క‌డ పేర్కొన్న హెడ్డింగ్ లోని ప్ర‌తి మాట‌కు ఒక అర్థం ఉంది. మ‌రికొద్ది గంట‌ల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. అందులో ఒక‌టి హైద‌రాబాద్ మెట్రో రైలు ప్రారంభ‌మైతే.. రెండోది అంత‌ర్జాతీయ బిజినెస్ స‌మ్మిట్‌కు హాజ‌రైన ముఖ్య అతిధి ఇవాంక హాజ‌రు కానున్నారు.

ఈ స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోడీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా హాజ‌రు కానున్నారు. ప‌రిమిత సంఖ్య‌లో నేత‌ల్ని ఆహ్వానిస్తున్నారు. నో ప్రోటోకాల్ పేరుతో స‌ద‌స్సుకు చాలామంది ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించ‌కుండా ఆపేశారు. అంత‌ర్జాతీయ స‌ద‌స్సు కావ‌టం.. గ‌తంలో నిర్వ‌హించిన స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించారో ఇప్పుడూ అదే రీతిలో నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పినా.. అసంతృప్తి మాత్రం భారీగా ఉంది.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఇంత భారీ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటే.. ప్ర‌జాప్ర‌తినిధుల్ని క‌నీసం కూడా ఆహ్వానించ‌రా? అన్న బాధ ప్ర‌తి ఒక్క‌రిలో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే  ప్ర‌ముఖ‌ల జాబితాను త‌గ్గించ‌టానికి వీలుగా నో ప్రోట్రోకాల్ ఇష్యూను బూచిగా చూపిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే. జీఈఎస్ వేదిక మీద ఎవ‌రెంత సేపు మాట్లాడ‌నున్నారు? అన్న‌ది చూస్తే.. తొలుత ఈ స‌ద‌స్సును ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు. మూడంటే మూడు నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే స‌మ‌యాన్ని కేటాయించారు. అనంత‌రం ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్ ప్ర‌సంగం చేయ‌నున్నారు. అయితే.. ఆమె స్పీచ్ ఐదు నిమిషాలు మాత్ర‌మే ప్ర‌సంగిస్తార‌ని చెబుతున్నారు. చివ‌ర‌గా స‌ద‌స్సులో  ప్రసంగించే ప్ర‌ధాని మోడీ మాత్రం ఏకంగా ప‌ది నిమిషాల‌పాటు ప్ర‌సంగిస్తార‌ని తెలుస్తోంది. అనుకున్న స‌మ‌యానికి అనుకున్న రీతిలొ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని భావిద్దాం.



Tags:    

Similar News