కేసీఆర్ కు జ‌గ‌న్ అంటే ఎంత ఇష్ట‌మో?

Update: 2019-06-02 04:22 GMT
రెండు తెలుగు రాష్ట్రాలు. ఒక‌టి తెలంగాణ‌, మ‌రొకటి ఏపీ. తెలంగాణ‌కు సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు. ఏపీకి సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్గి. ఎన్నిక‌ల‌కు ముందే వీరి మ‌ధ్య కొత్త స్నేహం పొత్తు పొడిచింది. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం ఉచ్ఛ‌స్థితిలో కొన‌సాగుతున్న వేళ‌... తెలంగాణ‌లో ఓదార్పు యాత్ర‌కు వెళ్లిన జ‌గ‌న్‌ను ఇదే కేసీఆర్ రాళ్ల‌తో దాడి చేయించారు. అంతేనా తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు వేదిక‌గా అడ్డుకున్న జ‌గ‌న్ ను ఆయ‌న తెలంగాణ ద్రోహిగా అభివ‌ర్ణించారు.

అయితే అదంతా గ‌తం. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్‌ - జ‌గ‌న్ ల మ‌ధ్య కొత్త స్నేహిం పొత్తు పొడిచింది. భాయి భాయి అంటూ సాగారు. ఏపీలో జ‌గ‌న్ గెలుపు కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మేన‌న్న‌ట్లుగా కేసీఆర్ ముందుకు సాగారు. ఎన్నిక‌ల వ్యూహాల‌తో పాటు కొంత మేర డ‌బ్బు మూట‌ల‌ను కూడా ఆయ‌న జ‌గ‌న్ కు అంద‌జేశార‌న్న వార్త‌లు వినిపించాయి. స‌రే... ఈ వైరం, స్నేహాల‌ను ప‌క్క‌న‌పెడితే... శ‌నివారం వీరిద్ద‌రి మ‌ధ్య ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది.

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వర్న‌ర్ న‌ర‌సింహ‌న్ హైద‌రాబాద్ లోని రాజ్ భవ‌న్ లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు ఏపీ సీఎం హోదాలో హాజ‌రైన జ‌గ‌న్‌ను... కేసీఆర్ ఎంత బాగా చూససుకోవాలో అంత‌కంటే కూడా బాగానే చూసుకున్నార‌న్న మాట వినిపిస్తోంది. అస‌లు పై ఫొటో చూస్తుంటే... జ‌గ‌న్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టైంది. అంతేనా... ఇద్ద‌రు జిగిరీ దోస్తుల మ‌ధ్య జ‌రిగే స‌ర‌దా స‌న్నివేశాల్లో ముందు నువ్వు అంటే... కాదు ముందు నువ్వే అంటూ చేయి పట్టుకుని లాగ‌డాలు, బ‌లంతంగా కూర్చోబెట్ట‌డం చూస్తుంటే... కేసీఆర్, జ‌గ‌న్ ఇద్ద‌రూ జిగిరీ దోస్త్ లుగానే క‌నిపించారు.

అయినా ఈ విందులో ఏం జ‌రిగిందంటే... విందుకు జ‌గ‌న్ కాస్త ముందు వెళ్ల‌గా, ఆ త‌ర్వాత కాసేపటికి కేసీఆర్ కూడా వ‌చ్చారు. కుశ‌ల ప్ర‌శ్న‌లు అయిపోయిన త‌ర్వాత విందులో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప‌క్క‌న ఎవ‌రు కూర్చోవాల‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. దీంతో నువ్వు కూర్చో అంటూ జ‌గ‌న్ కు కేసీఆర్ ఆఫ‌రిస్తే... లేదు లేదు... మీరే కూర్చోండి అంటూ కేసీఆర్ ను జ‌గ‌న్ కోరార‌ట‌. ఈ క్ర‌మంలో కాస్తంత చొర‌వ చూపిన కేసీఆర్‌... జ‌గ‌న్ చేయి ప‌ట్టుకుని మ‌రీ గ‌వ‌ర్న‌ర్ ప‌క్క‌న కూర్చోబెట్టి, ఆయ‌న ప‌క్క‌న కేసీఆర్ కూర్చున్నారు.  మొత్తంగా ఈ స‌న్నివేశం అదిరిపోయింద‌నే చెప్పాలి.


Tags:    

Similar News