వారొచ్చి వినతిపత్రం ఇవ్వగానే జగన్ కు కేసీఆర్ ఫోన్?

Update: 2020-03-06 04:15 GMT
ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఏ పని ఉత్తినే చేయని కేసీఆర్.. ఉన్నట్లుండి జగన్ కు ఫోన్ ఎందుకు చేసినట్లు? అన్న ప్రశ్న మీకు వస్తే.. మీరు సరిగా ఆలోచిస్తున్నట్లే. తెలంగాణ ముఖ్యమంత్రిని తమిళనాడు మంత్రులు కలిసి వినతిపత్రం ఇవ్వటం.. ఆ వెంటనే సీఎం జగన్ కు ఫోన్ చేసిన కేసీఆర్ కాసేపు ఆయనతో మాట్లాడటం గమనార్హం.

తమిళనాడు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి వీలుగా తమకు సాయం చేయాలంటూ ఆ రాష్ట్ర మంత్రులు పలువురు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను తెలంగాణ సీఎంకు వివరించారు. దీంతో స్పందించిన ఆయన.. ఈ విషయం మీద ఏపీ సీఎంతో కూడా మాట్లాడాల్సి ఉందని చెప్పటమే కాదు.. అప్పటికప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు.

తమిళనాడు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనికి జగన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయాన్ని తెలంగాణ సీఎంవో సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే.. తమిళనాడు ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని మాత్రం కేసీఆర్ వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం తమకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి తెలంగాణ.. ఏపీ రాష్ట్రాలకు అధికారికంగా లేఖలు అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

లేఖ అనంతరం మూడు రాష్ట్రాలకు చెందిన అధికారులు.. నిపుణుల స్థాయిలో చర్చలు జరిగి.. ఏకాభిప్రాయానికి వచ్చాక కార్యాచరణ సిద్ధం చేయాలన్న విషయాన్ని తమిళనాడు మంత్రులకు కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. తాగునీటి కోసం తమిళనాడు పడుతున్న బాధల్ని చూసి దేశం సిగ్గు పడాలని.. దేశంలో 70వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని.. దేశం మొత్తం నీటి అవసరాలు తీరిన తర్వాత కూడా 30వేల టీఎంసీలు నీళ్లు ఉంటాయని పేర్కొన్నారు. తమిళనాడు కు సాయం చేయటానికి సాటి సీఎంగా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన కేసీఆర్ మాటల్ని చూస్తే.. భారీ వ్యూహానికి పునాదిరాయి వేసినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News