సిక్కుల తలపాగాలోనూ కేసీఆర్ గులాబీ మార్క్

Update: 2022-09-01 04:35 GMT
అనూహ్యంగా వ్యవహరించటం.. మిగిలిన వారికి భిన్నంగా ఆలోచించటం.. అసలు ఇలాంటి ఎత్తులతో రాజకీయ పార్టీని నడుపుతారా? అన్న సందేహానికి సమాధానంగా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్. నిజానికి ఆయన రాజకీయ పార్టీ పెట్టటమే ఒక ఆసక్తికర పరిణామం అయితే.. ఆ పార్టీ జెండాగా పింక్ కలర్ ను ఎంచుకున్న వైనంపై అప్పట్లో ఆసక్తికరమైన చర్చే నడిచింది. దేశంలోని మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆయన పార్టీ జెండా రంగు ఉంటుందన్న సంగతి తెలిసిందే.

పింక్ కలర్ తో కూడిన జెండాను పట్టుకొన్న ఆయన.. అనూహ్యంగా విజయాల్ని సొంతం చేసుకోవటం.. తన జీవిత లక్ష్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసుకోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కల నిజం కావటంతో ఆయన తిరుగులేని నేతగా మారారు. ఎంతటి పెద్ద కెరటమైనా.. మరెంత తోపు నాయకుడికైనా డౌన్ ఫాల్ ఖాయమన్న మాటకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో ఆయన నిర్ణయాల మీదా.. ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీదా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆయన మీద కత్తి కట్టినట్లుగా బీజేపీ చేస్తున్న రాజకీయ యుద్ధానికి ధీటుగా బదులిస్తున్న కేసీఆర్.. మోడీ మీద నేరుగా యుద్ధాన్ని డిక్లేర్ చేయటం తెలిసిందే. మోడీ మీద సమరానికి రాజకీయ పార్టీల అధినేతలు ఎవరూ సాహించని వేళ.. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మొదలు పెట్టి.. తనకు సాధ్యం కాదన్నట్లుగా కాస్తంత తగ్గిపోవటం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సైతం ఒక అడుగు ముందుకు వేస్తే.. మరో అడుగు వెనక్కి వేయటం తెలిసిందే.

ఇలాంటి వేళ.. కేసీఆర్ మాత్రం తగ్గేదేలేదన్నట్లుగా విపక్షాల్ని ఒకటికొకటిగా ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే..ఆయన ప్రయత్నాలు అంత ఫలవంతంగా సాగుతున్న పరిస్థితి లేదు.ఆయనతో భేటీ అయిన ప్రతి ప్రభుత్వం.. పార్టీ అధినేతకు ఏదో ఒక తలపోటు ఎదురుకావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. వినాయకచవితి పండుగ పూట బిహార్ పర్యటన పెట్టుకున్న ఆయన.. రాజకీయ సంచలనంగా మారారు.

తన బిహార్ పర్యటనలో గాల్వాన్ ఆర్మీ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు.. ఆ మధ్య హైదరాబాద్ లోని చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలోమరణించిన బిహార్ కుటుంబాలకు నష్ట పరిహారం అందించే కార్యక్రమాల్ని చేపట్టారు. అంతేకాదు.. సిక్కుల మత గురువు గోవింద్ సింగ్ జన్మస్థలం పాట్నా లోని సాహిబ్ గురుద్వారాను సందర్శించిన సందర్భంగా ఆయన ధరించిన తలపాగా ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా తలపాగాను తెలుపు వస్త్రంతో ధరించటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు భిన్నంగా తన పార్టీ రంగు అయిన గులాబీ రంగుతో కూడిన తలపాగాను ఆయన ధరించిన వైనం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మిగిలిన వారికి తానెంత భిన్నమన్న విషయాన్ని తన తలాపాగాతో కేసీఆర్ చెప్పేశారని చెప్పాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News