గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ 2 గంట‌ల భేటీ ఎందుకు?

Update: 2018-03-06 06:00 GMT
ఎదుటోడు ఎంత‌టి తోపు అయినా లెక్క చేయ‌ని త‌త్త్వం కేసీఆర్ సొంతం. ఎదుటోడు మోడీ అయినా స‌రే.. ధీమాగా ధీటుగా బదులిచ్చేందుకు రెఢీ అయ్యే మొన‌గాడిగా ఇప్పుడాయ‌న అవ‌త‌రించారు. దేశాన్ని ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. త‌న క‌నుసైగ‌తో వ్య‌వ‌స్థ‌ల్ని శాసించే మోడీ మీద వార్ ను ప్ర‌క‌టించిన కేసీఆర్.. త‌న నిర్ణ‌యం వెనుక ఉన్న వ్యూహాన్ని.. త‌న వాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో పంచుకోవ‌టానికి తాజాగా భేటీ అయిన‌ట్లుగా చెబుతారు.

దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని చిత్ర‌మైన స‌న్నివేశం తెలంగాణ‌లో ఉంద‌ని చెప్పాలి. గ‌వ‌ర్న‌ర్ కు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రికి మ‌ధ్య‌నున్న రిలేష‌న్ ట‌చ్ మీ నాట్ అన్న‌ట్లుగా ఉంటుంది. కానీ.. తెలంగాణ విష‌యంలో మా్త్రం మిన‌హాయింపు ఉంద‌ని చెప్పాలి. గ‌వ‌ర్న‌ర్ ను గురువు కంటే ఎక్కువ‌గా భావించ‌టం.. అమితంగా అభిమానించ‌టం.. ఆయ‌న మాట‌ల‌కు విలువ ఇవ్వ‌టం.. తాను తీసుకునే విష‌యాల్ని చ‌ర్చించ‌టం.. మంచిచెడుల్ని బేరీజు వేసుకోవ‌టం లాంటివి కేసీఆర్ మాత్ర‌మే చేస్తుంటార‌ని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొద‌లు గ‌వ‌ర్న‌ర్ తో మంచి సంబంధాలు నెర‌ప‌టమే కాదు.. ఆయ‌న స‌ల‌హాలు.. సూచ‌న‌ల్ని కేసీఆర్ శ్ర‌ద్ధ‌గా వింటార‌ని.. కొన్నింటిని అమ‌లు చేస్తుంటార‌ని చెబుతారు. సీబీఐ డైరెక్ట‌ర్ గా త‌న‌కున్న అనుభ‌వం.. త‌న ప‌రిచయాలు.. త‌న నెట్ వ‌ర్క్ ను కేసీఆర్ కోసం గ‌వ‌ర్న‌ర్ వినియోగిస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు త‌గ్గ‌ట్లే.. ప్ర‌తి కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ముందు.. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అవుతుంటారు.

వీలైనంత ఎక్కువ‌గా గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యే కేసీఆర్‌.. త‌న వ‌ర్త‌మాన‌.. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల్ని చ‌ర్చిస్తార‌ని చెబుతారు. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌టం.. కొత్త త‌ర‌హా ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌.. తాజాగా గ‌వ‌ర్న‌ర్ తో రెండు గంట‌ల పాటు భేటీ కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఈ రెండు గంట‌ల్లో ఆయ‌న‌కు కేసీఆర్ ఏం చెప్పి ఉంటారు? ఏ అంశాల మీద స‌ల‌హా కోరి ఉంటార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు.. సీఎం ఆఫీసు నుంచి అన‌ధికారికంగా విడుద‌లైన ప్రెస్ నోట ప్ర‌కారం.. తన ఫ్రంట్ వెనుక మోడీ స‌ర్కారు మీద కోపం కంటే కూడా.. ఢిల్లీ రాజ‌కీయాలు.. కేంద్ర రాజ‌కీయాలు రాష్ట్రాల ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణి.. రాష్ట్రాల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త అంశాల‌పై త‌న‌కున్న ఆవేద‌న నేప‌థ్యంలో తానీ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

తాను తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో కేంద్రం నుంచి ఏ త‌ర‌హా ఎదురుదాడి స్టార్ట్ కావ‌టం ఖాయ‌మైన వేళ‌.. అదెలా ఉంటుంది?  దాన్ని ఎలా ఎదుర్కోవాలి?  లాంటి అంశాల మీద కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. అధికారిక ప్రెస్ నోట్ లో ఈ త‌ర‌హా స‌మాచారాన్ని పేర్కొన‌లేదు.

దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేయ‌టం.. రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయ‌టం.. ప్రాజెక్టుల ప‌రంగా.. ప‌రిశ్ర‌మ‌ల ప‌రంగా రాష్ట్రాల వైఖ‌రి మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న భావ‌న‌తో పాటు.. తెలంగాణ‌కు కేంద్రం చేయాల్సిన సాయంపై ఎంత మొత్తుకున్నా మోడీ మాష్టారి మ‌న‌సు క‌ర‌గ‌టం లేద‌ని వాపోయిన‌ట్లుగా తెలుస్తోంది. తుద‌కు ఇదే త‌న‌ను కేంద్రంపై పోరాడేలా చేస్తుంద‌న్న వాద‌న‌ను వినిపించిన‌ట్లుగా చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ క‌న్వీన్స్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. జాగ్ర‌త్త‌లు కొన్ని చెప్పి పంపిన‌ట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. త‌న మాట‌ల‌తో ఎవ‌రినైనా క‌న్వీన్స్ చేసే కేసీఆర్ కు.. రెగ్యుల‌ర్ గా క‌లిసే గ‌వ‌ర్న‌ర్ ను క‌న్వీన్స్ చేయ‌టం పెద్ద‌క‌ష్ట‌మైన ప్ర‌క్రియ కానే కాదు.

Tags:    

Similar News