విశిష్ట అతిధి కోసం రాజ్ భవన్ వెళ్లి వెయిట్ చేసిన కేసీఆర్

Update: 2021-06-12 06:30 GMT
అరుదైన సీన్ ఒకటి చోటు చేసుకుంది. తన జానీ జిగర్ దోస్త్ నరసింహన్ మాష్టారు గవర్నర్ పదవీకాలం పూర్తి అయిన తర్వాత నుంచి రాజ్ భవన్ కు రావటం బాగా తగ్గించేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నరసింహన్ గవర్నర్ గా ఉన్న వేళలో.. ప్రభుత్వం చేసే ప్రతి పనిని పూసగుచ్చినట్లుగా చెప్పేవారు. అయితే.. ప్రగతిభవన్ కాదంటే ఫాం హౌస్ అన్నట్లుగా ఉండే కేసీఆర్.. నరసింహన్ హయాంలో తరచూ రాజ్ భవన్ కు వెళ్లే వారు. గంటల కొద్దీ సమయాన్ని అక్కడే గడిపేవారు. నరసింహన్ తో ప్రభుత్వం చేపట్టే పలు అంశాల్ని వివరించేవారు.. ఒక్కో భేటీ కనీసం మూడు నుంచి ఆరు గంటల మధ్య సాగుతూ ఉండేది. దేశ చరిత్రలో మరే గవర్నర్ - మరే ముఖ్యమంత్రి ఇంత సుదీర్ఘంగా సంభాషించుకునే ఉదంతాలు ఉండేవి కావు.

అలాంటిది నరసింహన్ మాష్టారు వెళ్లి పోయి.. ఆయన స్థానంలో తమిళ సై గవర్నర్ పదవిని చేపట్టిన తర్వాత రాజ్ భవన్ కు రావటం బాగా తగ్గించేశారు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు రావటం.. వెళ్లిపోవటం లాంటివి చేసేవారు. అంతకు మించి ప్రోగ్రాంకు కాస్త ముందు వచ్చి ఉండటం లాంటివి అస్సలు లేవు. అందుకు భిన్నంగా తాజాగా.. ఒక విశిష్ఠ అతిధి కోసం రాజ్ భవన్ కు కాస్త ముందుగా రావటమే కాదు.. ఆయన కోసం వెయిట్ చేసిన ఉదంతం చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్పెషల్ గెస్టు ఎవరంటారా?

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తెలుగోడు జస్టిస్ ఎల్వీ రమణ.. తొలిసారి సీజేఐ హోదాలో రెండు తెలుగు రాష్ట్రాలకు రావటం తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎల్వీ రమణ దంపతులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నానానికి చేరుకోవటం తెలిసిందే. అక్కడ నుంచి పటిష్ట బందోబస్తుతో బయటకు వచ్చారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళ సై దంపతులతో పాటు.. అక్కడే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. మొత్తంగా ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయనున్న ఎల్వీ రమణ.. రాజ్ భవన్ లోని గెస్టు హౌస్ లోనే ఉండనున్నారు.
Tags:    

Similar News