ట్రోఫీనే వద్దు.. పాక్ గడ్డపై అడుగుపెట్టం.. తేల్చిచెప్పిన కేంద్రం
భారత్ జట్టు పాక్ లో పర్యటించడం సాధ్యం కాదంటూ కీలక ప్రకటన శుక్రవారం నాటి ఐసీసీ కీలక సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
పాకిస్థాన్ లో క్రికెట్ అంటే బంతులతో కాదు.. బుల్లెట్లతో అనే అభిప్రాయం ఉంది. అంతర్జాతీయ క్రికెటర్లపైనే (2009లో శ్రీలంక జట్టుపై) కాల్పులు జరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది జరిగి 15 ఏళ్లు దాటినా.. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా తీవ్రం అయ్యాయి. అందుకనే ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) క్రికెట్ టోర్నీలు నిర్వహించడం లేదు. 1996 తర్వాత మళ్లీ 2025లో తొలిసారిగా ఐసీసీ టోర్నీ జరగనుంది. అయితే, ఇందులో పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు పలికింది. పాక్ లో శాంతిభద్రతలు సరిగా లేవని, తమ జట్టు అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అంతేకాక బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.
ఐసీసీ కీలక భేటీకి ముందు
భారత్ జట్టు పాక్ లో పర్యటించడం సాధ్యం కాదంటూ కీలక ప్రకటన శుక్రవారం నాటి ఐసీసీ కీలక సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై చర్చ నేపథ్యంలో, హైబ్రిడ్ మోడల్ ద్వారా నిర్వహణ ప్రస్తావనకు వస్తోంది. దీని ప్రకారం భారత్ ఆడే మ్యాచ్ లను పాకిస్థాన్ లో కాకుండా వేరే దేశంలో నిర్వహిస్తారు. గతంలో ఆసియా కప్ ను కూడా ఇలాగే నిర్వహించారు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం దీనికి సిద్దంగా లేదు. భారత్ చెప్పినట్లు తాము వినాలా? అని భావిస్తోంది.
భారత్ లేకుంటే భారీ నష్టమే
చాంపియన్స్ ట్రోఫీ అంటే వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ స్థాయి టోర్నీ. అలాంటిదాంట్లో భారత్ పాల్గొనకపోతే టోర్నీ ఆకర్షణ తగ్గుతుందనేది ఐసీసీ ఆందోళన. పాక్ బోర్డు మాత్రం ఇది తమ ఆత్మగౌరవ విషయం అని.. హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోమని అంటోంది.
హైబ్రిడ్ వద్దంటే టోర్నీనే షిఫ్ట్..
పాకిస్థాన్ మొండిపట్టుకు ఐసీసీ జగమెండిపట్టు పట్టింది. పాకిస్థాన్ గనుక హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోకుంటే టోర్నీని వేరే దేశానికి తరలిస్తామని అల్టిమేటం విధించింది. పాక్ కు రావాలని భారత్ ను ఆదేశించే స్థితిలో ఐసీసీ లేనందున చాంపియన్స్ ట్రోఫీ కథ ఏం కానుందో చూడాలి. మరోవైపు టోర్నీకి మూడు నెలల సమయం కూడా లేదు. హైబ్రిడ్ కు ఓకే అయితేనే శనివారం పీసీబీతో సమావేశమై షెడ్యూల్ ను ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తోంది. అదే జరిగితే భారత్ ఆడే మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ చూస్తోంది.