బాబు ఇంటికి కేసీఆర్ వెళ్లి పిలవరంట

Update: 2015-12-09 03:58 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంకు ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మొన్న జరిగిపోయిన ఆదివారం.. ఏదో ఒక సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి.. ఏపీ సీఎం ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తారన్న అంచనాలు కొనసాగాయి.

అయితే.. మారిని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. పిలుపుల వ్యవహారంలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క ఎమ్మెల్సీ.. ఆ వెంటనే వచ్చి పడే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బాబు ఇంటికి వెళ్లటం సరికాదన్న వాదన గులాబీ బ్యాచ్ వ్యక్తం చేస్తోందట. ఈ విషయం ఇప్పటికే కేసీఆర్ దృష్టికి వెళ్లటం.. తమ వాదనను బలంగా వినిపించటంతో.. కేసీఆర్ కూడా కన్వీన్స్ అయినట్లుగా చెబుతున్నారు.

ఈ కారణం చేతనే.. యాగం పిలుపుల విషయంలో బాబును ఆహ్వానించటం ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మొన్న శని.. ఆది.. సోమవారం ఉదయం వరకూ చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్నారు. చంద్రబాబును ఆహ్వానించేందుకు ఇంతకు మించిన చక్కటి అవకాశం ఉండదు. కానీ.. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాబు ఇంటికి వెళ్లటం సరికాదంటూ సన్నిహితులు చేసి వాదనకు విలువనిచ్చిన కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న మార్పులతో.. గులాబీ నేతలు బాబుకు ఆహ్వానంపై విచిత్రమైన అంశాన్ని తెర పైకి తెస్తున్నారు. శుభకార్యానికి ఇంటికి వెళ్లి పిలవటం ఆనవాయితీ అని.. బాబు ఇంటికి (బెజవాడ) వెళ్లి పిలుస్తామని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పిలుపుల కోసం బాబు ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లరని.. పని ఒత్తిడి కారణంగా.. యాగం పనులతో బిజీ పేరిట.. ఎవరో ఒకరిని విజయవాడకు పంపి.. ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బాబు రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News