అన‌ధికారికం: ముంద‌స్తుకు కేసీఆర్ రెఢీ!

Update: 2018-08-23 17:11 GMT
ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌టంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. బిగ్ బాస్ 2 ట్యాగ్ లైన్ అయిన ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న‌ది కేసీఆర్ తీరు తెలిసిన వారెవ‌రైనా చెప్పే మాట‌. గ‌డిచిన కొద్ది రోజులుగా సాగుతున్న ముంద‌స్తు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

అన‌ధికారికంగా వ‌స్తున్న స‌మాచారం.. ఈ రోజు ఉద‌యం నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. ముంద‌స్తుకు కేసీఆర్ రెఢీ అయిన భావ‌న క‌లుగ‌క మాన‌దు. బుధ‌వారం సాయంత్రం మొద‌లైన మంత్రివ‌ర్గ స‌మావేశం ఏడు గంట‌ల మార‌థాన్ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన మంత్రులు నోరు విప్ప‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు. అన్ని గంట‌ల పాటు స‌మావేశం జ‌రిగినా.. మీటింగ్‌లో తీసుకున్న నిర్ణ‌యాల మీద ఒక్క మాట చెప్ప‌కుండానే మంత్రులు వెళ్లిపోయారు.

నిజంగా ముంద‌స్తు ఆలోచ‌న లేక‌పోతే.. అన్ని గంట‌ల పాటు స‌మావేశం జ‌ర‌గాల్సి ఉందా? అన్న ప్ర‌శ్న ఒక‌ప‌క్క‌.. మ‌రోవైపు భారీ బ‌హిరంగ స‌భ కోసమే ఇంత చ‌ర్చ అన్న మాట వినిపించింది. కేసీఆర్ లాంటి నేత‌కు భారీ స‌భ‌లు పెట్ట‌టం పెద్ద విష‌య‌మా?  అధికారం లేన‌ప్పుడే స‌భ‌ల‌తో అద‌ర‌గొట్టిన గులాబీ అధినేత‌కు.. చేతిలో ప‌వ‌ర్ ఉన్న వేళ ఆపేదెవ్వ‌డు?  అంతదానికి అన్నేసి గంట‌లు స‌మావేశం పెట్టి మ‌రీ స‌ల‌హాలు అడుగుతాడా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది.

దీన్ని నిజం చేస్తూ.. ఈ రోజు (గురువారం) గ‌వ‌ర్న‌ర్ తో కేసీఆర్ భేటీ కావ‌టంతో ముంద‌స్తు అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్..వారితో భేటీకావ‌టంతో ముంద‌స్తు మీద అంచ‌నాలు మ‌రింత బ‌ల‌మ‌య్యాయి. ఇది స‌రిపోన‌ట్లు కొద్ది సేప‌టి క్రితం (రాత్రి 9 గంట‌ల వేళ‌లో) సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌నున్నార‌ని.. ప్ర‌ధాని మోడీతో స‌హా.. ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం కానున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. ఢిల్లీలో నాలుగైదు రోజులు ఉండ‌నున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు ఖ‌రారు అయిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్పుడు వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. సెప్టెంబ‌రు 2న భారీ బ‌హిరంగ స‌భ‌ను పూర్తి చేసి.. రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ అసెంబ్లీని ర‌ద్దు చేస్తార‌న్న మాట‌ను చెబుతున్నారు.  స‌భ త‌ర్వాత అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. విప‌క్షాల్ని చెడుగుడు ఆడేసుకున్నాక త‌న ముంద‌స్తు నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉందంటున్నారు. తాజా ప‌రిణామాల‌తో తెలంగాణ రాజకీయం ఒక్క‌సారిగా వేడెక్కింద‌ని చెప్పాలి.  


Tags:    

Similar News