ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు కేసీఆర్ మంగ‌ళం పాడిన‌ట్టేనా?

Update: 2022-06-27 06:30 GMT
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడ‌రల్ ఫ్రంట్ కు మంగ‌ళం పాడినట్టేనా? అంటే అవున‌నే అంటున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. కాంగ్రెస్, బీజేపీ కూట‌మిల‌కు వ్య‌తిరేకంగా మూడో ఫ్రంట్ ను తెర‌మీద‌కు తేవాల‌ని గ‌త కొంత‌కాలంగా కేసీఆర్ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్, జేడీఎస్ అధినేత‌, మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ సింగ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, శివ‌సేన సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే, త‌మిళ‌నాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ త‌దిత‌రుల‌ను కేసీఆర్ క‌ల‌సి వ‌చ్చార‌ని గుర్తు చేస్తున్నారు.

అయితే త‌మ కూట‌మిలో ఏదో ఒక జాతీయ పార్టీ (కాంగ్రెస్) లేకుండా మూడో ఫ్రంట్ సాధ్యం కాద‌ని ఆయా పార్టీలు భావిస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదో ఒక జాతీయ పార్టీ అండ ఉంటేనే కేంద్రంలో అధికారంలోకి రావ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయా పార్టీలు భావిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మూడో ఫ్రంట్ త‌ర‌ఫున అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నించినా ఎవ‌రూ ముందుకు రాలేద‌ని అంటున్నారు.

మ‌రోవైపు విప‌క్షాల త‌ర‌ఫున రాష్ట్రపతి అభ్య‌ర్థిని ఎంపిక చేసేట‌ప్పుడు కూడా కేసీఆర్ హాజ‌రుకాలేద‌ని గుర్తు చేస్తున్నారు. దాదాపు 20కి పైగా పార్టీలు ఢిల్లీలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఏర్పాటు చేసిన స‌మావేశానికి హాజ‌రైనా.. కాంగ్రెస్ పార్టీ కూడా అందులో ఉంద‌నే కేసీఆర్ హాజ‌రు కాలేద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో థ‌ర్డ్ ఫ్రంట్ లేదా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌ని ఆయా పార్టీలు భావిస్తున్నాయ‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ని వ‌దిలిపెట్టేసిన‌ట్టేన‌ని అంటున్నారు. జూన్ 27న య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌రుకావ‌డం కూడా ఇందుకు నిద‌రన్శ‌మ‌ని చెబుతున్నారు.

య‌శ్వంత్ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమంలో కేటీఆర్ సహా కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంటున్నారు. యశ్వంత్‌ సిన్హాకు మద్దతునిస్తున్నట్లు అధికారికంగా టీఆర్‌ఎస్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రానప్పటికీ.. కేటీఆర్‌ స్వయంగా నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరవుతుండటం విశేష‌మ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News