కల సరే.. పని మాటేంటి కేసీఆర్?

Update: 2016-08-04 07:17 GMT
నిందించటం.. తప్పు పట్టటం చాలా తేలిక. కానీ.. ఆ తప్పుల్ని సరి చేయటం ఎంత కష్టమన్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటికైనా తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఏర్పాటు చేసిన తొలి రెండు..మూడు మీడియా సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు.. డ్రైనేజీ వ్యవహారంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరాన్ని భ్రష్టు పట్టించారంటూ నిప్పులు చెరిగారు. వ్యవస్థ మొత్తాన్ని మార్చేస్తామన్న మాటలు చెప్పారు.

ఇలాంటి మాటలు చెప్పి కేసీఆర్ దాదాపు రెండేళ్లు పూర్తి అయి.. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన ఏదైతే అంశాల్ని ప్రస్తావించి.. తీవ్రంగా నిందించారో అవే పరిస్థితులు ఉండటమే కాదు.. మరింత దారుణంగా తయారైన దుస్థితి. చివరకు ఆయన కుమారుడు కమ్ తెలంగాణ మంత్రి అయిన కేటీఆర్ ఆకస్మిక పర్యటనలు చేసి.. అధికారులకు వార్నింగ్  ఇచ్చినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాని పరిస్థితి.

రెండు వారాల్లో పరిస్థితి మొత్తం మారిపోవాలని లేకుంటే చర్యలు తప్పవని బెదిరించినా పని పూర్తి కాలేదు. తనతో అయ్యే పని కాదని అనుకున్నారో.. లేక తండ్రినే సీన్లోకి తెప్పించాలని భావించారో కానీ.. తాజాగా హైదరాబాద్ రోడ్లు.. డ్రైనేజీ అంశంపై గ్రేటర్ అధికారులతో ముఖ్యమంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎప్పటిలానే గంటల కొద్దీ సమీక్షను నిర్వహించిన ఆయన.. రోడ్లు ఎలా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. రానున్న నాలుగేళ్లలో ఎన్ని దశల్లో.. ఎంతమేర పనులు పూర్తి చేయాలన్న తన స్వప్నాన్ని ఆవిష్కరించారు.

ఇప్పటివరకూ రోడ్లు వేస్తున్న విధానంలో చోటు చేసుకున్న లోపాల్ని ప్రస్తావించి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే రోడ్లు సరిగా లేని కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారని.. ఆ దుస్థితి నుంచి ప్రజల్ని బయటకు పడేయాల్సిన అవసరాన్ని ఆయన పలుమార్లు ప్రస్తావించారు. ఇదంతా బాగానే ఉన్నా.. నిత్యం హైదరాబాద్ రోడ్ల మీద నగరవాసులు పడుతున్న నరకయాతనను ఎప్పటిలోపు తప్పిస్తారన్న విషయం మీద మాత్రం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం. ఇప్పటికే హైదరాబాద్ మహానగరాన్ని ఎలా తయారుచేయాలి.. రోడ్లు ఎలా ఉండాలన్న విషయాన్ని కేసీఆర్ పలుమార్లు చెప్పారు.ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఆయన కలలు కాదు.. పని మాత్రమే. చినుకు పడితే చిత్తడి అయ్యే రోడ్ల దుస్థితి మార్చటంతో పాటు.. ఇప్పటివరకూ కురిసిన వర్షాల కారణంగా దారుణంగా దెబ్బ తిని.. గుంతలుగా మారిన రోడ్లను అత్యవసరంగా మార్చాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ కలల్ని వినేంత ఓపిక హైదరాబాద్ మహానగర వాసులకు లేదన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News