ఇన్ స్టెంట్ కాఫీ ముచ్చట ఎన్నాళ్లు కేసీఆర్!

Update: 2016-10-07 05:30 GMT
మొత్తంగా మారిపోవాలి. అలా కుదరకపోతే మార్చేయాలి. ఎక్కడ చూసినా.. తన ముద్ర కనిపించాలి. విధానాలు మొదలు.. అన్నింట్లోనూ టీఆర్ ఎస్ అధినేత కనిపించాలన్నట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా.. పాలనలో ఇంకా కుదురుకోలేదన్న విమర్శ వినిపిస్తున్న వేళ.. అలాంటి వాటిని పట్టించుకోకుండా విధానాల్ని పూర్తిగా మార్చేయాలన్న ధోరణి కేసీఆర్ లో కనిపిస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న మూస పాలనకు బ్రేకులు వేయాలని ఆయన భావిస్తున్నారు.

సాంకేతికంగా చూస్తే.. కేసీఆర్ ఆలోచనల్ని తప్పుగా చెప్పలేం. అలా అని రైట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే.. వ్యవస్థను ఒక్కసారిగా మార్చటానికి ఇదేమీ కాల్పనిక కథ కాదు. చూప్ మంత్రకాళి అనగానే కోరుకున్నట్లుగా మారిపోవటానికి. అలా కోరుకోవటం అత్యాశే అవుతుంది. కేసీఆర్ విధానాన్నే చూడండి. ఓ పక్క సచివాలయం మొదలు.. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ల  వరకూ కొత్త కొత్తగా ఉండాలంటూ నిర్మాణాలకు పూనుకోవటం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఇచ్చిన భారీ హామీల సంగతి తెలిసిందే. ఇవి చాలవన్నట్లుగా సాగునీటి ప్రాజెక్టుల విధానం బాగోలేదంటూ.. రీడిజైనింగ్ చేసేశారు. ఇప్పుడు పాలనా సంబంధమైన అంశాల మీద ఆయన దృష్టి పెట్టారు.

మూస పద్ధతిలో.. అవసరం ఉన్నా లేకున్నా శాఖల్ని ఏర్పాటు చేసి.. ఉద్యోగుల్ని నియమించటం అర్థం లేనిదే. అలా అని ఆ పేరుతో మొత్తాన్ని మార్చేయాలని అనుకోవటం వల్ల జరిగే ప్రయోజనం ఎంతన్నది సందేహమే. పాలనా పరంగా ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానాల్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని.. అన్ని జిల్లాల్లో పాలన ఒకేలా ఉండదని.. జిల్లాకు తగ్గట్లుగా పాలన ఉంటుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అదెలా అంటే..అడవులు లేని జిల్లాలో అడవుల శాఖ ఎందుకు? ఉద్యానవనాలు లేని జిల్లాలో హార్టీకల్చర్ శాఖ ఎందుకు? గిరిజనులు లేని జిల్లాలో గిరిజనాభివృద్ధి శాఖ అవసరం లేదు కదా? అన్నది కేసీఆర్ ప్రశ్న. నిజమే..ఆయన చెప్పిన దాన్లోనూ లాజిక్ ఉంది. కాదనలేం.కాకుంటే.. ఆ పేరుతో మొత్తం స్ట్రక్చర్ మార్చేస్తామని చెప్పటం సరికాదేమో. ఎందుకంటే.. ఆదర్శాలు చెప్పటం వేరు. వాటిని ఆచరణలోకి తీసుకురావటం వేరు.

అదెలానంటే.. కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం వినేందుకు చాలా బాగుంటుంది. వారు చెప్పింది జరిగితే చాలా బాగుంటంది. కానీ.. అలా జరుగుతుందా? అన్నదే ప్రశ్న. ఇక్కడ కూడా ఇదే లాజిక్. వ్యవస్థను పూర్తిగా మార్చేయాలన్న తపనతో.. కొత్త కొత్త విధానాల్ని ప్రవేశ పెట్టేయటం ద్వారా.. ఇప్పుడున్న పాలన ఖరాబు అవుతుందన్నదే సందేహం. ఈ డౌట్ ఎందుకంటే.. కేసీఆర్ వైఖరితోనే. ఆయన నిత్యం కొత్త కొత్తగా ఆలోచిస్తారు. కాకుంటే.. సీజన్ వారీగా ఆయన కొన్ని అంశాల మీద దృష్టి పెడతారు. ఆ తర్వాత షిఫ్ట్ అయిపోతారు. ఆ మధ్యన ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటూ హడావుడి జరిగింది. ఇప్పుడు ఆ ఊసే కనిపించని పరిస్థితి. ఇప్పుడంతా కొత్త జిల్లాల ఏర్పాటు మీదనే ఫోకస్ ఉంది. అందులో భాగంగానే జిల్లాల పాలనా విధానాల్ని పూర్తిగా మార్చేస్తామని చెబుతున్నారు.

ఒక పని ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి చేయటంమీద కూడా అంతే ఆసక్తి ఉండాలి. కానీ.. కేసీఆర్ తీరు అందుకు భిన్నం. ప్రారంభించే విషయంలో ప్రదర్శించే ఉత్సాహం.. పూర్తి చేసే విషయంలో కనిపించదు. సమస్య అంతా అక్కడే వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో అనుసరించాల్సిన పాలన మీద కేసీఆర్ కసరత్తు మొదలెట్టారు. ఉన్నట్లుండి ఆయనకు ఈ విషయం మీద ఎందుకు దృష్టి పెట్టారంటే.. అందుకు కారణం లేకపోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పుడున్న విధానంలో అయితే.. భారీగా అధికారుల అవసరం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న జిల్లా సెటప్ లో..31 జిల్లాల్లో ఏర్పాటు చేయాలంటే మాటలు కాదు. ఉద్యోగులు పెద్ద ఎత్తున అవసరం అవుతుంది.కొత్త జిల్లాలతో తాను కోరుకున్నట్లుగా లాభాలు చేకూరాలే కానీ.. లేనిపోని కష్టాలు రావటం కేసీఆర్ కు ఇష్టం లేదు. అలా అని.. వచ్చి పడే కష్టాల్ని ఆపటం ఆయన చేతుల్లో లేదు. అందుకే.. పాలనా విధానాన్ని మొత్తంగా మార్చేస్తే తప్పించి లెక్క సెట్ కాదు. అందుకే.. పాలనాపరంగా ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానాల్ని ‘మూస’ ఖాతాలోకి వేసేసిన ఆయన.. ఇప్పుడు పాలన కొంగొత్తగా ఉండాలని భావిస్తున్నారు. జిల్లాల సంఖ్య అనుకోకుండా పెరిగిపోవటం.. అందుకు అనుగుణంగా సెటప్ ను ఏర్పాటు చేయటం కష్టమైన నేపథ్యంలో ప్రత్యామ్నాయం మీద దృష్టి పెట్టిన కేసీఆర్.. కొంగొత్త పాలనా విధానానికి తెర తీశారు.

పాలనలో సంస్కరణలు తేవాలన్నదే కేసీఆర్ ఆలోచన అయి ఉంటే ఇంత హడావుడిగా విధానాల్ని మారుస్తూ నిర్ణయం తీసుకోరు. ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూ పోతారు. కేసీఆర్ నిర్ణయాలతో.. ఆయన కలల్ని వ్యతిరేకించేది ఇందుకే. పాలనా విధానాన్ని మార్చటం కోసం ఇప్పటికిప్పుడు కొంతమంది సీనియర్ ఐఏఎస్ లను.. పలు రాష్ట్రాలకు పంపి.. అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని చెబుతున్నారు. కేసీఆర్ కు కానీ దీర్ఘకాలిక విజన్ ఉండి ఉంటే.. ఈ పనిని కొత్త జిల్లాల్ని ప్రారంభించే సమయంలోనే చేసి ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునే వారు కాదు. తాను కోరుకున్నట్లుగా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోవాలని కోరుకోవటం మంచిది కాదు. ఎందుకంటే.. కంఫర్ట్ కోరుకున్న వారికే తప్పించి మిగిలిన వారికి ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. పాలనలో మార్పు వ్యవస్థలో నిజమైన మార్పు తెచ్చేలా ఉండాలే తప్పించి.. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఎదురయ్యే సవాళ్లకు సమాధానాల కోసంగా హడావుడి నిర్ణయాలు మంచివి కావు. ఎంత ఇన్ స్టెంట్ కాఫీ వచ్చినా.. ఫిల్టర్ కాఫీ రుచితో పోటీ పడలేదన్నది ఎంత నిజమో.. కేసీఆర్ కొంగొత్త నిర్ణయాల తీరు  ఇన్ స్టెంట్ కాఫీ లెక్కనే తప్పించి.. ఫిల్టర్ కాఫీ మాదిరి కాదన్నది నిజం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News