రామోజీరావు.. జూ. ఎన్టీఆర్ లపై కేసీఆర్ కోపం.. ‘బ్రహ్మస్త్రం’ చిత్రానికి శాపం??

Update: 2022-09-02 16:32 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత సౌమ్యంగా ఉంటారో.. ఎదురించిన వారి పట్ల అంతే కఠినంగా ఉంటారు. గులాబీ దళపతిని ఎదురించిన వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. రాజకీయం అయినా మీడియాలో అయినా అందరికీ అనుభవమే. అందుకే కేసీఆర్ తో పెట్టుకోవడానికి ముందువెనుకా ఆలోచిస్తారు. అయితే కేసీఆర్ కంటే బలమైన బీజేపీ అండ ఉండతో ఇప్పుడు కొందరు కొత్త రాజకీయం మొదలుపెడుతున్నారు.

ఇటీవల ఈనాడు సంస్థల అధినేత, మీడియా మొఘల్ రామోజీరావును కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవడం.. ఆ తర్వాత సీనీ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ను కలిసి రాజకీయం పండించారు. వీరిద్దరిని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగానే అమిత్ షా వాడాడని టాక్ నడిచింది. రామోజీ నుంచి కేసీఆర్ ను ఓడించేందుకే సలహాలు స్వీకరించారని ప్రచారం సాగింది.

ఇప్పుడు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో హిందీ ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మస్త్ర’ ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మన కింగ్ నాగార్జున , హిందీ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ బ్రహ్మస్త్ర ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీరిలీజ్ ఫంక్షన్ కు అంతా సిద్ధమైన వేళ కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. ఈ భారీ ప్యాన్ ఇండియా మూవీకి రామోజీ ఫిలిం సిటీలో చేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనివెనుక కారణం ఏమీ లేదని.. బీజేపీకి దగ్గరైన రామోజీరావు, జూ.ఎన్టీఆర్ మీద ప్రతీకారంతోనే కేసీఆర్ సర్కార్ ఇలా చేసిందన్న ప్రచారం సాగుతోంది. రాజకీయాలతో అంటకాగిన ఇద్దరి వల్ల ఇప్పుడు ‘బ్రహ్మస్త్ర’ మూవీకి శాపమైందని అంటున్నారు.

ఎన్నో సినీ వేడుకలు హైదరాబాద్ లో సాగుతున్నాయి. అన్నింటికి కేటీఆర్, కేసీఆర్ సహకరిస్తున్నారు. కానీ రామోజీ ఫిలింసిటీలో ఇంతపెద్ద ప్యాన్ ఇండియా మూవీ వేడుకకు కేసీఆర్ సర్కార్ అనుమతి నిరాకరించడం చర్చనీయాంశమైంది. రామోజీ, ఎన్టీఆర్ లపై కోపంతోనే ఇదంతా కేసీఆర్ సర్కార్ చేస్తోందన్న వాదనకు బలం చేకూరేలా పరిణామాలు కనిపిస్తున్నాయని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తామన్న కేసీఆర్ సర్కార్ ఈ ప్రతీకార రాజకీయం ‘బ్రహ్మస్త్ర’ మూవీకి శాపంగా మారిందంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News