టైం విషయంలో విపక్షాల మాటకు కేసీఆర్ ఓకే

Update: 2016-12-15 09:53 GMT
కొన్ని విషయాల్లో ఎవరి మాట విననట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో తనకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి మాత్రం.. విపక్షాల మాటకు ఓకే చెప్పినట్లుగా కనిపిస్తోంది.

వర్షాకాల సమావేశాల్ని పూర్తిగా ఎత్తేసి.. జీఎస్టీ బిల్లుకు తమ మద్దుతును ప్రకటించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీని నిర్వహించిన కేసీఆర్.. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాల ఊసే ఎత్త లేదు. తాజాగా.. శీతాకాల సమావేశాల్ని నిర్వహించేందుకు ఓకే చెప్పేశారు. తెలంగాణ అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలి? అన్న అంశంపై విపక్షాలతో కలిసి భేటీ నిర్వహించారు.

బీఏసీ సమావేశానికి ముందు బీజేపీ పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని ఈసారి 20 రోజులు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు సైతం వ్యక్తం చేశారు. ఆసక్తికరంగా విపక్షాలు కోరినట్లే.. తెలంగాణ అసెంబ్లీ సమావశాల్ని 20 పని దినాలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఇందుకు సంబంధించిన అజెండాను కూడా సిద్ధం చేయటం గమనార్హం.

పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చ జరపాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీసమావేశాలకు సంబంధించిన ఈ నెల 30వరకూ చేపట్టాల్సిన అజెండాను డిసైడ్ చేశారు. కొత్త సంవత్సరంలో ఒక వారం పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్ని ఎన్ని రోజులు నిర్వహించాలి? చర్చకు ఏయే అంశాల్ని చేపట్టాలన్న అంశాలపై అధికార.. విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదురటం బాగున్నా.. ఇదే వాతావరణం సభలోనూ కొనసాగుతుందా? అన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News