కేసీఆర్ ప‌థ‌కం!..దేశానికే మోడ‌ల్ అయిపోతోందా?

Update: 2019-01-02 09:58 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఇప్పుడు ఒక్క తెలంగాణ‌కే కాకుండా యావ‌త్తు దేశానికి ఓ రోల్ మోడ‌ల్‌ గా మారిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విప‌క్షాల‌న్నీ ఒక్క‌టైపోయి... త‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగినా... త‌న‌దైన మార్కు వ్యూహాల‌ను విప‌క్షాలన్నీ క‌ట్ట క‌ట్టుకుని వ‌చ్చిన మ‌హా కూట‌మిని తుత్తునీయ‌లు చేసేశారు. వెర‌సి కొత్త రాష్ట్రం తెలంగాణ‌కు తొలి  సీఎంగానే కాకుండా రెండో సీఎంగా కూడా ఆయ‌నే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్నా కూడా... ఏమాత్రం విప‌క్షాల కూట‌మికి భ‌య‌ప‌డ‌కుండా కేసీఆర్ ఎలా ముందుకు వెళ్ల‌గలిగార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేసిన ఇత‌ర రాష్ట్రాల్లోని అధికార పార్టీల‌తో పాటు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కూడా... కేసీఆర్ విజ‌య ర‌హ‌స్యం ఇదేనంటూ ఇప్పుడు ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. కేసీఆర్ ఏ ప్లాన్ తో అయితే విజ‌య ఢంకా మోగించారో - తాము కూడా అదే ప్లాన్‌ ను అమ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో మరింత మేర మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకునేందుకు ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు కేసీఆర్ తురుపు ముక్క‌ను అమ‌లు చేసేందుకు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌గా... మ‌రో ఆరు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా కేసీఆర్ మోడ‌ల్ ను యాజిటీజ్‌ గా అమ‌లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక కేసీఆర్ మోడ‌ల్ విష‌యానికి వ‌స్తే... రైతుల‌కు స‌బ్సీడీలు కాకుండా నేరుగా పెట్టుబ‌డుల‌ను ప్ర‌భుత్వం నుంచి అందించే ఉద్దేశ్యంతో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద ప్ర‌తి ఎక‌రాకు ఏడాదిలో రెండు విడ‌త‌లుగా రూ.4000 చొప్పున పెట్టుబ‌డిని అందిస్తారు. తొమ్మిది నెల‌ల ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్‌... తాను ప్ర‌క‌టించిన రైతు బంధు ప‌థ‌కం అమ‌లులో భాగంగా తెలంగాణ‌లోని 58 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో తొలి విడ‌త రూ.4000ల‌ను వారి బ్యాంకు ఖాతాల్లోనే జ‌మ చేశారు. ఆ త‌ర్వాత స‌రిగ్గా పోలింగ్ జ‌ర‌గడానికి కాస్తంత ముందుగా రెండో విడ‌త రూ.4000 వేల‌ను కూడా కేసీఆర్ స‌ర్కారు... రైతుల ఖాతాల్లో జ‌మ చేసింది. ఈ జ‌మ‌కు సంబంధించిన మెసేజ్‌ ల‌ను ఎస్సెమ్మెస్‌ ల ద్వారా రైతుల మొబైల్ ఫోన్ల‌కు పంపిన ప్ర‌భుత్వం... బ్యాంకు అధికారుల ద్వారానూ రైతుల‌ను వాక‌బు చేసింది. మొత్తంగా పోలింగ్ ద‌గ్గ‌ర‌ప‌డిన నేప‌థ్యంలో రైతు బంధు సొమ్ము త‌మ బ్యాంకు ఖాతాల్లో జ‌మ కావడంతో విప‌క్షాలు ఎంత మేర యాగీ చేసినా కూడా కేసీఆర్ వైపే రైతాంగం మొగ్గు చూపింది.

ఈ మ‌ర్మాన్ని గ్ర‌హించిన ప‌శ్చిమ బెంగాల్‌ - ఒడిశా - జార్ఖండ్ సీఎంలు ఈ త‌ర‌హా ప‌థ‌కాన్ని త‌మ త‌మ రాష్ట్రాల్లో ప్ర‌క‌టించేశారు. ఇక మ‌రో ఆరు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నికలు జ‌ర‌గ‌నుండ‌గా... ఇప్పుడు న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ స‌ర్కారు కూడా రైతు బంధు త‌ర‌హాలో ఓ కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అయితే కేసీఆర్ రైతుల‌ను టార్గెట్‌ గా చేసుకుంటే... మోదీ మాత్రం నిరుపేద కుటుంబాల ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్నార‌ట‌. అయితే ఈ ప‌థ‌కంలో కేసీఆర్ రైతు బంధు మాదిరిగా కాకుండా నిరుపేద‌ల‌ ఖాతాలో రూ.3000 చొప్పున జ‌మ చేయ‌నున్న‌ట్లుగా వినికిడి. అంతేకాకుండా దేశ‌వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 10 కోట్ల మంది నిరుపేద‌ల కుటుంబాల‌కు ప్ర‌తి నెల ఈ సొమ్మును నేరుగానే వారి ఖాతాల్లో జ‌మ చేయాల‌ని భావిస్తోందట‌. మొత్తంగా కేసీఆర్ స‌క్సెస్ ఫార్ములాను మోదీ కూడా అనుక‌రించ‌బోతున్నార‌న్న మాట‌. చూద్దాం... ఈ ప‌థ‌కం మోదీని ఏ మేర‌కు గ‌ట్టెక్కిస్తుందో?


Full View

Tags:    

Similar News