రైతుబంధు సింగిల్ డే ప్ర‌చారం కోసం అన్ని కోట్లా?

Update: 2018-05-10 10:02 GMT
అర‌కొర‌గా పెట్ట‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అస్స‌లు ఇష్టం ఉండ‌దు. అయితే.. ఆక‌లితో మాడుస్తారేమో కానీ.. పెడితే మాత్రం క‌డుపు నిండుగా పెట్టేస్తారు. ఇంకా చెప్పాలంటే.. చాల్లే బాస్‌.. క‌డుపు నిండిపోయింది. మ‌రింత తింటే ఆయాసం గ్యారెంటీ అన్న‌ట్లుగా ఆయ‌న విధానాలు ఉంటాయి.

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు పెంచాల్సి వ‌స్తే.. ఏ ముఖ్య‌మంత్రి అయినా.. ఉద్యోగులు అడిగిన పెంపు శాతాన్ని గీసి గీసి మ‌రీ బేరాలు ఆడుతుంటారు. కానీ.. కేసీఆర్ తీరు అలా ఉండ‌దు. ప‌ది శాతం పెంచాల‌ని ఉద్యోగులు అడిగితే.. 12 శాతం పెంచేసి.. ఓకేనా?  క‌డుపు నిండిందా? అంటూ అడిగేసి నోటి వెంట మాట రాకుండా చేస్తుంటారు.

ఇప్ప‌టికే ఇలాంటి స్వీట్ షాకులెన్నో ఇచ్చిన కేసీఆర్‌.. తాజాగా త‌న డ్రీం స్కీం అయిన రైతుబంధును షురూ చేశారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని సాల‌ప‌ల్లి-ఇందిరాన‌గ‌ర్ ల‌లో తానే స్వ‌యంగా రైతుల‌కు చెక్కులు ఇచ్చారు. ప్ర‌తి పంట సీజ‌న్లో రైతుల‌కు పంట సాయాన్ని అందిస్తారు. ఎక‌రాకు రూ.8వేలు చొప్పున  సాయం ఇచ్చే ఈ ప‌థ‌కం అమ‌లు కోసం ఏడాదికి రూ.12వేల కోట్లు ఖ‌ర్చు కానుంది. దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్థి పొందే రైతులు ఎంద‌రో తెలుసా?  అక్ష‌రాల 58 లక్ష‌లు.

భూరికార్డుల్ని ప్ర‌క్షాళ‌న చేయ‌టం.. పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకునే ఈ ప‌థ‌కం ద్వారా వ‌చ్చేసార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టించే వీలుంద‌ని చెబుతున్నారు. ఈ భారీ ప‌థ‌కాన్ని షురూ చేసిన నేప‌థ్యంలో మీడియాకు పండుగ చేశారు. రెండు పేజీల జాకెట్ యాడ్ ను మీడియాకు ఇచ్చేశారు. ఇక‌.. టీవీ ఛాన‌ళ్ల‌కు అయితే పెద్ద ఎత్తున షార్ట్ వీడియోల్ని టెలికాస్ట్ చేసేలా ఆర్డ‌ర్ ఇచ్చేశారు.

ప‌థ‌కం స్టార్ట్ చేసిన మొద‌టి రోజున భారీ ఎత్తున మీడియాలో ఈ ప‌థ‌కం ప్రచారంలోకి రావ‌టానికి కేసీఆర్ స‌ర్కారు పెడుతున్న ఖ‌ర్చు ఎంతో తెలుసా?  అక్ష‌రాల రూ.100కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కానికి ఇంత భారీ ఎత్తున ఖ‌ర్చు చేయ‌ట‌మా? అన్న సందేహం వ‌చ్చినా.. కేసీఆరా మ‌జాకానా అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌న రైతుబంధు ప‌థ‌కం ప్ర‌చారాన్ని తెలుగు పేప‌ర్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా ఉర్దు.. ఇంగ్లిషు.. హిందీతో  ప‌లు ప‌త్రిక‌ల‌కు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు..  త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క‌.. కేర‌ళ‌.. ఒడిశా.. ప‌శ్చిమ‌బెంగాల్‌.. గుజ‌రాత్.. రాజ‌స్థాన్.. మ‌హారాష్ట్రల‌లో ప‌బ్లిష్ అయ్యే దిన‌ప‌త్రిక‌ల‌కు భారీ యాడ్స్ ఇచ్చేశారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లో త‌న ముద్ర వేయాల‌ని త‌పిస్తున్న కేసీఆర్.. త‌న తాజా ప‌థ‌కంతో దేశ వ్యాప్తంగా చ‌ర్చ రేపాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రో.. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. పోటాపోటీగా సాగుతున్న కర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారం ఈ రోజుతో ముగుస్తున్న వేళ‌.. జాతీయ రాజ‌కీయ పార్టీల యాడ్స్ తో ద‌ర్శ‌న‌మివ్వాల్సిన క‌న్న‌డ ప‌త్రిక‌లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుబంధు ప‌థ‌కం యాడ్స్ తో నిండిపోవ‌టం చూస్తే.. ఇలాంటివి కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్త‌మ్మీదా ఒక ప‌థ‌కం ప్రారంభం కోసం ఒక రోజుకు కేసీఆర్ ఖ‌ర్చు చేసినట్లు చెబుతున్న రూ.100 కోట్లు ఒక రికార్డుగా మిగులుతుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News