చండీయాగ నిర్వహణకు స్థలంకోసం తిప్పలు

Update: 2015-11-04 13:01 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరవావుకు ఇప్పుడు అర్జెంటుగా 30 ఎకరాల భూమి కావలసివస్తోంది. డిసెంబర్ నెలలో తాను తలపెట్టిన ఆయుధ చండీయాగ నిర్వహణకు ఈ 30 ఎకరాలు కావలసివస్తోంది. దీనికోసం ఆయన ఇప్పటికే వెదుకులాట మొదలెట్టేశారు కూడా. తనకు తన కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు దేవతల ఆశీస్సులు కావాలన్న కోరికతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దింపజేసినందుకు సమస్త దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని కూడా కేసీఆర్ ఉబలాటపడుతున్నారు. పైగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తనను చేసినందుకు దేవతలకు ఆయన రుణపడి ఉన్నారుకూడా.

అందుకే కనీవినీ ఎరుగని రీతిలో అయిదు రోజులపాటు నిర్వహించనున్న ఈ యాగానికి కోట్లాది రూపాయలను మంచి నీళ్లలాగా ఖర్చుపెట్టబోతున్నారు.  డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఈ యాగం నిర్వహించాలని పథకం వేసుకున్నారు కూడా. ఇటీవల డిల్లీ వెళ్లినప్పుడు కేసీఆర్ పనిలో పనిగా రాష్టపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మోదీని కూడా కలిసి చండీయాగానికి రావలసిందిగా ఆహ్వానించారు.వారిద్దరూ తప్పక యాగానికి వస్తామని మాట ఇచ్చారని కూడా తెలుస్తోంది.

రాష్టపతి - ప్రధాని ఇరువురూ తన ఆహ్వానాన్ని మన్నించడంతో కేసీఆర్ ఇక చండీయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి నడుంకట్టారు. ఆయనకు ఇప్పుడు అర్జెంటుగా 30 ఎకరాల స్థలం కావాలి. ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో అలాంటి స్తలం ఉన్నట్లు కనిపెట్టారు కాని అది 22 ఎకరాలు మాత్రమే ఉండటంతో హతాశులయ్యారు. ఎందుకంటే హెలిపాడ్లు నిర్మించడానికి, వీవీఐపీలకు గట్టి భద్రత కల్పించడానికి కనీసం 30 ఎకరాల స్థలం కావాలి. దీంతో యాగనిర్వహణకు తగిన స్థలం కోసం కేసీఆర్ శృంగేరి పీఠం పరమాచార్యులు, ప్రముఖ వేద పడింతులతో కలిసి శనివారం నుంచి స్థల వెదుకులాటలో పడిపోయారు.
Tags:    

Similar News