కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందా?

Update: 2017-05-20 09:21 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందా..? మోడీ, అమిత్ షాలు తనను రౌండప్ చేసే వ్యూహాలు రచించారని ఆయన అనుమానిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ గెలుపు అంత ఈజీ కాదని ఆయన ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే అంటున్నారు కొందరు. ఆ భయంతోనే కేసీఆర్ ప్రజల నాడి తెలుసుకునేందుకు ఒక సర్వే చేయిస్తున్నారని టాక్.
    
తెలంగాణ ప్ర‌జ‌ల ప‌ల్స్ తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ మ‌రోసారి స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ త‌ర‌పున రెండు సార్లు స‌ర్వే నిర్వ‌హించారు. గ‌త ఏడాది ఒక‌సారి, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మ‌రోసారి స‌ర్వే నిర్వ‌హించారు. తొలి స‌ర్వేకు, రెండో స‌ర్వే మ‌ధ్య ప్ర‌జాప్ర‌తినిధుల ర్యాంకుల్లో చాలా తేడాలు వచ్చాయి. మొద‌టి స‌ర్వేలో 70,80 శాతం తెచ్చుకున్న ప్ర‌జాప్ర‌తినిధులు రెండో స‌ర్వేకు పాస్ మార్కులు వేయించుకున్నారు. దీంతో వారికి అప్ప‌ట్లో వార్నింగ్‌ లు ఇచ్చారు కేసీఆర్‌.
    
తాజాగా మ‌రోసారి స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు కేసీఆర్‌. ఈ సారి స‌ర్వేలో సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల ప‌నితీరుతోపాటు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌టిష్ట‌త‌, ఇత‌ర బ‌ల‌మైన నాయ‌కుల ప‌రిస్థితితో పాటు బీజేపీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా స‌ర్వేలో ఓ ప్ర‌శ్న ఉంచారు. దీంతో పాటు రైతుల‌కు ఎరువుల ప‌థ‌కం,చేప‌లు,గొర్రెల పంపిణీ, ఇత‌ర ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల మూడ్ తెలుసుకోనున్నారు. ఇటు ఈ స‌ర్వే ఫలితాలతో ప‌నితీరు స‌రిగా లేని ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ హెచ్చ‌రిక‌లు జారీచేయ‌నున్నారు, అంతేకాకుండా ఆ స్థానంలో ఇత‌రుల‌కు అవ‌కాశాన్ని కూడా ప‌రిశీలిస్తార‌ట‌.  2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నార‌ని గులాబీ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఎన్నికల లోగా ఇంకా కొన్ని స‌ర్వేలు నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు.  ఏ ఒక్క ఛాన్సునూ మిస్ చేసుకోకూడదని... లోపాలు గుర్తించి సవరించుకుని ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News