నిజమే: అమరావతిలో కేసీఆర్ ప్రసంగం

Update: 2015-10-22 04:16 GMT
నిజమే: అమరావతిలో కేసీఆర్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిస్తే.. సీమాంధ్రుల మీద విషం చిమ్ముతారన్నది సీమాంధ్రుల అభిప్రాయం. తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే కేసీఆర్.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ఇదో ప్రత్యేకతగా నిలిచిపోనుంది.

ఇంతకాలం తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే క్రమంలో ఏపీ గురించి తిట్టిపోసిన కేసీఆర్ లాంటి నేత.. ఇప్పుడు ఏపీ రాజధాని గడ్డ మీద నిలుచొని ప్రసంగించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశంగా చెబుతున్నారు. కేసీఆర్ ప్రసంగించే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయటం.. వారి నుంచి ఓకే వచ్చేయటం జరిగింది.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ వస్తారని భావించినా.. పంజాబ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కార్యక్రమం రద్దైంది. ఈ నేపథ్యంలో ఆయను బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉండేలా మార్పులు చేశారు. ఇక.. కేసీఆర్ బాధ్యతను ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకు అప్పజెప్పారు. ఆయన వచ్చింది మొదలు.. తిరిగి వెళ్లే వరకూ కేసీఆర్ బాధ్యత మొత్తం చినరాజప్పదేనని చెబుతున్నారు.

నిజానికి కేసీఆర్ ప్రసంగం మొదట అనుకున్న షెడ్యూల్ లో లేదు. తాజాగా జరిగిన మార్పుల్లో భాగంగా ఆయన ప్రసంగాన్ని చేర్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ప్రసంగం దాదాపు మూడు నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్యన ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ప్రధాని మోడీ ప్రసంగాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగులో తర్జుమా చేయనున్నారు. సీమాంధ్రుల రాజధానిలో నిలుచొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏం సందేశం ఇస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News