ఎమ్మెల్యే చేతికి బీఫారాల వెనుక కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్!

Update: 2019-04-23 05:03 GMT
తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలివి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఏం చేసినా ప‌క్కా ప్లానింగ్ తో పాటు.. దూర‌దృష్టితో నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఆయ‌న దిట్ట‌గా చెబుతారు. తాజాగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల‌కు బీఫారాలు ఇచ్చే ప‌నిని ఎమ్మెల్యే చేతికి అప్ప‌గించ‌టం తెలిసిందే.

స్థానిక సంస్థ‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌ఫు పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు పార్టీ బీఫారాలు స్థానిక ఎమ్మెల్యేలు ఇవ్వటం వెనుక అస‌లు లెక్క‌లు వేరుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. కేసీఆర్ వేసిన మాస్ట‌ర్ ప్లాన్ లో భాగంగానే ఎమ్మెల్యే చేతికి బీఫారాలు ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

గ‌తంలో టీఆర్ఎస్ పార్టీలో ఎవ‌రైనా నేత‌లు చేరుతుంటే.. వారంతా కేసీఆర్ ను క‌లిసి.. ఆయ‌న ఆశీస్సులు తీసుకొని.. పార్టీ కండువా క‌ప్పుకునే వారు. ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన మార్పును చూస్తే.. కేసీఆర్ ను క‌లిసే వారి కంటే.. కేటీఆర్ ను క‌ల‌వ‌టమే కాదు.. పార్టీలో చేరే కార్య‌క్ర‌మాన్ని ఆయ‌నే చేప‌డుతున్నారు. ఎందుకిలా అంటే?  రాబోయే రోజుల్లో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంటే.. త‌న‌దైన జ‌ట్టు కేటీఆర్ కు ఉండాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే ఇలా చేస్తున్నార‌ని చెప్పాలి.

పార్టీలో చేరాల‌నుకునే విప‌క్ష నేత‌ల‌కు సంబంధించిన మంతాల్ని కేటీఆరే స్వ‌యంగా చేప‌డుతున్నారు. పార్టీలో చేరే వారికి సంబంధించిన అంశాల‌న్నీ కేటీఆర్ ముందుకు రావ‌టం జ‌రుగుతోంది. ఎమ్మెల్యేల విష‌యంలో అనుస‌రిస్తున్న వ్యూహాన్నే తాజాగా జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల్లోనూ అమ‌లు చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న్ట‌లు చెబుతున్నారు.

ఎమ్మెల్యేల్లో అత్య‌ధికులు కేటీఆర్ కు విధేయులుగా ఉండ‌టం ఒక ఎత్తు అయితే... ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉండే వారంతా  కేటీఆర్ జ‌ట్టుగా ఉండాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతారు. దూర‌పు ఆలోచ‌న కూడా ఈ నిర్ణ‌యానికి కార‌ణమంటారు.  

ఎమ్మెల్యేల విష‌యంలో సొంత టీం ఎలానో.. స్థానిక నాయ‌క‌త్వం విష‌యంలోనూ అలాంటి వ్యూహాన్నే అమ‌లు చేస్తున్నారు. త‌మ గుప్పిట్లో ఉండేలా ఎమ్మెల్యేలు.. వారి గుప్పిట్లో ఉండేలా స్థానిక నేత‌లు ఉంటే పార్టీకి.. కేటీఆర్ నాయ‌క‌త్వానికి తిరుగు ఉండ‌ద‌న్న మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థ‌ల‌కు పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపిక‌.. వారి చేతికి పార్టీ బీఫారాల్ని స్థానిక‌ ఎమ్మెల్యే ఇవ్వ‌టం ద్వారా.. స్థానిక నేత‌లంతా స‌ద‌రు ఎమ్మెల్యేకు జ‌వాబుదారీగా ఉంటార‌న్న ఆలోచ‌న కూడా కార‌ణంగా చెబుతున్నారు. రేపొద్దున గులాబీ పార్టీలో జ‌ర‌గ‌కూడ‌నిది ఏదైనా జ‌రిగినా.. నేత‌లంతా చెల్లాచెదురు కాకుండా ఉండ‌టం.. ఒకే ప‌వ‌ర్ స్టేష‌న్ ఉండేలా చేయ‌టంలో భాగంగానే ఎమ్మెల్యే చేతికి స్థానిక ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌కు ఇవ్వాల్సిన బీఫారాలు ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేనుజ‌ట్టుగా చేసి.. వారి జ‌ట్టుగా స్థానిక నాయ‌క‌త్వం ఉండేలా కేసీఆర్ ప్లానింగ్ అద‌ర‌హో అనిపించ‌క మాన‌దు.
Tags:    

Similar News