కొడుకు..మేనల్లుడ్ని సెట్ చేశారు..మిగిలింది కూతురేనా?

Update: 2019-09-09 04:50 GMT
ఎట్టకేలకు కేబినేట్ ను విస్తరించారు. ఆరుగురికి పదవులు కట్టబెట్టారు. ఏ ఒక్కరి పదవి ఊడబీకలేదు. దీంతో.. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు తొమ్మిది.. పది నెలలకు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుతీరినట్లైంది. అంచనాలకు తగ్గట్లే కొడుకు కేటీఆర్ కు.. మేనల్లుడు హరీశ్ లకు మంత్రి పదవులు ఇవ్వటంతో పాటు.. కీలక శాఖల్ని అప్పజెప్పారు.

దీంతో కొడుకు.. మేనల్లుడికి పదవుల్ని కట్టబెట్టటం ద్వారా ఒక పెద్ద పని పూర్తి అయ్యిందన్నట్లుగా ఉన్న కేసీఆర్.. తన కుమార్తె విషయంలో ఏం చేయనున్నారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఓటమిపాలైన కవితకు ఏ పదవి కట్టబెట్టనున్నారన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.

ఎంపీగా ఓటమి చెందిన ఆమెకు ఏదో పదవి ఇవ్వకపోవటం ధర్మమా? అన్న ప్రశ్న పార్టీలో వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఆమెను రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలిని చేస్తారన్న ప్రచారం సాగినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో హుజూరాబాద్ నుంచి బరిలోకి దింపాలని భావించినట్లుగా చెబుతారు. అయితే.. ఇందుకు కవిత నో చెప్పినట్లుగా సమాచారం. తాను బరిలోకి దిగిన నిజామాబాద్ నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లనని.. తాను అక్కడి నుంచే బరిలోకి దిగుతానని చెప్పినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే.. ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని కొందరు.. కాదు..ఆమెను రాజ్యసభకు పంపాలన్నయోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయాల మీద స్పష్టత రావట్లేదు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఆమెను.. ఎమ్మెల్సీ కంటే కూడా రాజ్యసభకు ఎంపిక చేసి పంపే వీలుందంటున్నారు.

ఎందుకంటే.. రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇద్దరి పదవీ కాలం 2020 ఏప్రిల్ లో ముగియనుంది. ఈ రెండింటిలో ఒకటి కవితకు కట్టబెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ అంచనాలు ఎంతమేర నిజమవుతాయన్నది కాలమే తేల్చాలి. కొడుకు.. మేనల్లుడికి పదవుల్ని సెట్ చేసిన కేసీఆర్ కూతురు విషయంలో ఏం చేయకుండా ఉండటం ఏం బాగుంటుంది?


Tags:    

Similar News