త‌న మ‌నిషికి బంప‌ర్‌ ఆఫ‌ర్ ఇచ్చిన కేసీఆర్‌

Update: 2016-11-23 13:29 GMT
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు విభిన్న శైలికి నిద‌ర్శ‌నం. త‌న వార‌నుకుంటే వారిని భారీగా గౌర‌వించే ల‌క్ష‌ణం ఉన్న కేసీఆర్ ఈ క్ర‌మంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌ శర్మకు మ‌రో భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శ‌ర్మ‌ను నియమించాలని నిర్ణయించారు. ఆ పదవిలో ఆయనను మూడేండ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న‌ రాజీవ్‌ శర్మ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఆ వెంటనే ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రధాన సలహాదారుగా పరిపాలనా వ్యవహారాలను రాజీవ్‌ శర్మకు సీఎం అప్పగించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎస్‌ గా రెండున్నరేళ్లుగా బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్‌ శర్మకు ఉమ్మడి ఆస్తుల విభజన - ఉద్యోగుల విభజన - ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాల అంశాలపై క్షుణ్ణమైన అవగాహన ఉంది. అలాగే ఈ రెండున్నరేళ్ల‌లో సీఎం కేసీఆర్‌ కు ఆయన వెన్నంటి ఉన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాష్ర్టాభివృద్ధికి అనేక పాలసీలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో కీలక పాత్ర వహించారని టీఆర్ ఎస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికే ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నారని తెలిసింది. సీఎస్‌ గా సీ బ్లాక్ నుంచి బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్‌ శర్మ ప్రధాన సలహాదారుగా కూడా సీ బ్లాక్ నుంచే విధులు చేపట్టనున్నారు. సీ బ్లాక్‌ లోని ఆరో అంతస్తులో ఇటీవ‌లి వరకు సీఎం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్‌ కు కేటాయించిన కార్యాలయాలను కలిపి రాజీవ్‌ శర్మకు కొత్త చాంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా రాజీవ్‌ శర్మ స్థానంలో రాష్ట్ర కొత్త సీఎస్‌ గా ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్‌ చంద్రను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రాజీవ్‌ శర్మ పదవీ విరమణ చేయగానే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు ప్రధాన సలహాదారుగా రాజీవ్‌ శర్మ నియామకం, సీఎస్‌ గా ప్రదీప్‌ చంద్రకు బాధ్యతలు అప్పగించడానికి సంబంధించిన ఫైళ్లను ముఖ్యమంత్రి అనుమతికి పంపేలా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News