కేసీఆర్.. కోనాయిపల్లి.. ఏంటి కథ?

Update: 2018-11-14 07:28 GMT
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత పెద్ద భక్తుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేవుళ్ల విషయంలో ఆయనకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల నుంచి మొదలుపెడితే.. ఇప్పటిదాకా ఏ సీఎం పాల్గొనని స్థాయిలో భక్తి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేసీఆర్. ఇందుకోసం భారీగా ఖర్చు కూడా పెట్టారు. ప్రభుత్వం తరఫున భారీగా యాగాలు.. యజ్ఞాలు చేయించాడు. తిరుమల శ్రీవారికి కోట్ల రూపాయల కానుకలు ఇచ్చారు. ఇంకా కేసీఆర్ కు భక్తి సంబంధింత సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి. ఆయనకు సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి ఆలయం అంటే విపరీతమైన భక్తి. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన తరచుగా సందర్శిస్తుంటారు. రాజకీయ పరమైన ముఖ్య కార్యకలాపాలు ఏం చేయాల్సి వచ్చినా ముందు ఆ ఆలయాన్ని సందర్శిస్తారు.

1985లో టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినప్పుడు ఇదే ఆలయాన్ని దర్శించుకుని నామినేషన్ పత్రాలను దైవ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసి జలదృశ్యంలో టీఆర్ ఎస్ స్థాపించిన సమయంలోనూ ఆయన కోనాయిపల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఉద్యమ సమయంలో కరీంనగర్ ఎంపీగా - మహబూబ్ నగర్ ఎంపీగా.. 2014 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన సమయంలోనూ.. కోనాయిపల్లి సెంటిమెంటును కేసీఆర్ ఫాలో అయ్యారు. ఈ రకంగా కేసీఆర్‌ కు కోనాయిపల్లి ఆలయం బాగా సెంటిమెంటు అయిపోయింది. ఎన్నిక ఏదైనా సరే ఈ ఆలయాన్ని దర్శించుకుని అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడం ఆయనకు అలవాటు. ఇప్పుడు తెలంగాణలో డిసెంబరు 7న జరగబోయే ఎన్నికల కోసం బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న కేసీఆర్.. మరోసారి కోనాయిపల్లి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు జరిపించి.. అక్కడి నుంచి గజ్వేల్ కు చేరుకుని మధ్యాహ్నాం 2.34 గంటలకు నామినేషన్ వేస్తారట.

Tags:    

Similar News