చండీయాగం అధికారికమా? అనధికారికమా?

Update: 2015-10-25 05:12 GMT
అంగరంగ వైభవంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పట్ల ఒక్క ఏపీ ప్రజలే కాదు తెలుగు వారంతా ఆసక్తిగా గమనించారు. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా దీనిపై ప్రత్యేక దృష్టి పడింది. ఈ కార్యక్రమంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. చంద్రబాబు నిర్వహణ సామర్థ్యాన్ని కూడా చాటి చెప్పింది. ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయినా బాబు తలుచుకుంటే ఏ స్థాయిలో నిర్వహిస్తారన్న విషయాన్ని చాటి చెప్పేందుకు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఒక నిదర్శనంగా చెబతారు.

ఇదిలా ఉంటే.. శంకుస్థాపన కార్యక్రమానికి తలదన్నేలా చండీయాగం చేయాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష. వాస్తవానికి దీనికి సంబంధించిన సమాచారం శనివారం బయటకు వచ్చింది కానీ.. ఇదేమీ కొత్త విషయం కాదు. కొన్ని నెలలుగా దీనికి సంబంధించిన కసరత్తు భారీగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే.. చండీయాగం కేసీఆర్ డ్రీం ప్రాజెక్టుగా అభివర్ణించే వారూ ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా కేసీఆర్ చేపట్ట దలిచిన చండీయాగం స్థాయి ఓ రేంజ్ లో ఉండనుంది. దీని కోసం ఆయన భారీ ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతారు.

చండీయాగానికి తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు కనెక్ట్ అయ్యే అంశాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పడితే అయుత చండీయాగాన్ని చేపట్టాలన్నది కేసీఆర్ ఆలోచన. దీనికి తగ్గట్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినా ఏదో ఒకటి అడ్డురావటం.. సమయం కుదరకపోవటంతో ఆగిపోయింది. తాజాగా చండీయాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. నవంబరు లేదంటే డిసెంబరులో నిర్వహించే ఈ యాగం రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందంటే.. వెయ్యి మంది బ్రాహ్మణులు ఇందులో పాల్గొననున్నారు.

బ్రాహ్మణులే వెయ్యి మంది పాల్గొంటే..ఈ కార్యక్రమం స్థాయి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాగం ద్వారా తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలని.. వారి సంక్షేమం కోసమే నిర్వహించాలన్న తలంపులో కేసీఆర్ ఉన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యదక్షతను నిరూపించుకుంటే.. తాజా యాగంతో కేసీఆర్ తన నిర్వహణ సత్తాను నిరూపించుకోవాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రిని కానీ ఆహ్వానించాలని భావిస్తున్నారు. అయితే.. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహిస్తేనే వారిని పిలిచే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతారు.

ఒకవేళ.. తెలంగాణ సర్కారు అధ్వర్యంలో కానీ చండీయాగం నిర్వహిస్తే.. ఇక.. యాగం జరిగిన రోజుల హడావుడి ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. చండీయాగం జరిగిన  రోజుల్నీ తెలంగాణ రాష్ట్ర పండగను తలపించేలా ఉంటాయంటున్నారు. బతుకమ్మ సందర్భంగా ఎలా అయితే సెలవులు ఇచ్చారో అలాంటి సెలవులు ఇవ్వటంతో పాటు.. అధ్యాత్మిక భావనతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఊగిపోయేలా చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతారు. అయితే.. అధికారికంగా నిర్వహించే ఇంత పెద్ద యాగానికి తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించటం రాజకీయంగా తీవ్ర విమర్శలకు తావిచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. చండీయాగాన్ని అధికారికంగా నిర్వహిస్తారా? లేక అనధికారికమా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Tags:    

Similar News