కేసీఆర్ మాయ‌..4వేల కోట్ల‌ ఆస్తి విలువ 25వేల కోట్లు

Update: 2018-03-26 18:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ఏదైనా అది ప్ర‌జా సంక్షేమం కోణంలో ఉంద‌ని టీఆర్ ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తే...కాదు..అందులో స్కాం ఉంద‌ని విమ‌ర్శిస్తుంటారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. అలాగే తాజాగా శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ వ‌ర‌కు మెట్రో రైలు విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంపై రేవంత్ మండిప‌డ్డారు. గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్ - ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ చేసిన ప్ర‌తి స్కీం అవినీతిమ‌యమేన‌ని ఆరోపించారు. క‌సీఆర్ తన రాజకీయ - ఆర్థిక లబ్ది పొందిన తర్వాత మెట్రో వర్క్స్ ప్రారంభించారని, మెట్రోను ఆలస్యంగా నిర్మించడం వల్ల నిర్మాణవ్యయం పెరిగింద‌న్నారు.

31 కిలోమీటర్ల మెట్రో మార్గానికి రాయదుర్గం-శంషాబాద్ నిర్మాణానికి 4వేల 650 కోట్లు ఖ‌ర్చవుతాయని అంచనా వేశారని - మెట్రో నిర్మాణాన్ని తన ఆదాయ మార్గంగా కేసీఆర్‌ మార్చుకుంటున్నారని ఆరోపించారు. తన బంధువులు - మిత్రులకు వేల కోట్ల ఆదాయ విస్తరణకు ఈ మార్గాన్ని వాడుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ రూట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంద 150 కోట్లకు కిలోమీటర్ కు ఖర్చు అవుతుందంటున్నారని కానీ ఇందులో మ‌త‌ల‌బు ఉంద‌న్నారు. ప్రారంభంలో తక్కువ ఖర్చు చూపెట్టి...తర్వాత ఖర్చు పెంచే అవకాశముందన్నారు. త‌న ఆప్తుడు అయిన మైహోం రామేశ్వర్ రావుకు చెందిన 5వేల కోట్ల భూమి విలువను ఐదు రెట్లు 25వేల కోట్లు పెంచేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని ఆరోపించారు.

రామేశ్వర రావు ఆస్తులను వేల కోట్ల నుంచి లక్షల కోట్లు పెంచేందుకు 10 వేల కోట్లు అప్పు తెస్తున్నార‌ని రేవంత్ దుయ్య‌బ‌ట్టారు. ప‌ట్టణ నడిబొడ్డు నుండి మెట్రో నిర్మించకుండా ఔటర్ నుంచి నిర్మించడం వెనక కేసీఆర్ దనదాహం దాగి ఉంద‌ని రేవంత్ విరుచుకుప‌డ్డారు. పలక్ నుమా నుంచి శంషాబాద్ కు మెట్రో రూట్ నిర్మాణానికి నాలుగువేల కోట్లు అవుతుంది. అదే...రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో కు 8వేల కోట్లు అవుతుందన్నారు. ఇలా రూట్ మార్చడం వల్ల టికెట్ ధర కూడా 40 రూపాయల నుండి 100కు పెరుగుతుందన్నారు. త‌న బంధువుల‌కు మేలు చేసేందుకు కేసీఆర్ ప్ర‌జ‌ల జేబులు న‌ష్ట‌పోయేలా చేస్తున్నార‌ని ఆరోపించారు.
Tags:    

Similar News