వారికి ఇస్తే హుండీలో వేసినట్లేనట

Update: 2016-12-04 05:43 GMT
పెద్దనోట్ల రద్దుతో నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు కొన్నింటిని చేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బడా బాబులు కొందరు.. పేదల్ని మాయ చేస్తూ.. వారి జనధన యోజన ఖాతాల్లో తమ దగ్గరి నల్లధనాన్ని పెద్ద ఎత్తున వేసి.. తర్వాత మార్చుకునేలా చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టే ప్రయత్నాన్ని షురూ చేశారు. యూపీలో జరిగిన ఒక బహిరంగ సభలోమాట్లాడిన ఆయన.. జనధన ఖాతాల్లో అక్రమంగా వేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వొద్దని పిలుపునివ్వటం కనిపిస్తుంది.

జనధన యోజన ఖాతాల్లో వేసే నల్లధనంతో తిప్పలు తప్పవన్న హెచ్చరికలు చేసిన మోడీ సర్కారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆ ఖాతాల్లో వేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వొద్దని చెప్పటం ద్వారా.. నల్లకుబేరులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని చెప్పాలి. అంతేకాదు.. తనను తాను ఒక ఫకీర్ గా అభివర్ణించుకున్న ఆయన.. తాను పేదల కోసమే పని చేస్తున్నానని.. అదే తన తప్పులా కనిపిస్తోందన్న వ్యాఖ్యను చేయటం గమనార్హం.

అవినీతిని పెకిలించేందుకు తాను పని చేయటం వల్లనే తనపై ఇన్ని నిందలు వేస్తున్నారన్న ఆయన.. తాను ప్రజల కోసం యుద్ధం చేస్తున్నానని.. తన వస్తువుల్ని బ్యాగులో వేసుకొని వెళ్లిపోగలనన్న మాటను చెప్పటం ద్వారా.. తన దగ్గర ఆస్తిపాస్తులేమీ లేవన్న మాటను చెప్పకనే చెప్పటం గమనార్హం. పేద ప్రజల్ని రోడ్ల మీద క్యూలలో నిలబెట్టారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న బలమైన వాదనపై మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. పదునైన ప్రతివాదనతో తిప్పి కొట్టే ప్రయత్నం చేయటం గమనార్హం.

పంచదార.. గోధుమలు.. కిరోసిన్ లాంటి నిత్యవసర వస్తువులకు సైతం క్యూలలో గడిచిన 70 ఏళ్లుగా నిలుచుంటున్నారని.. ప్రస్తుతం బ్యాంకుల వద్ద నిలుచుంటున్నదే ఆఖరి క్యూ అవుతుందన్నఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘క్యూలలో నిలుచుంటున్న దేశ ప్రజలకు ఇదే చిట్టచివరి క్యూ. మీ ఖాతాల్లో ఇతరులు జమ చేసిన డబ్బును తిరిగి ఇవ్వకండి. అలా చేస్తామని నాకు మాట ఇవ్వండి. మీ ఖాతాల్లో అక్రమంగా డబ్బులేసిన వారిని జైలుకు పంపటానికి కావాల్సిన కసరత్తు చేస్తున్నా. ఆ డబ్బంతా పేదల ఇళ్లకే చేరాలన్నదే నా ప్రయత్నం’’ అని చెప్పటం గమనార్హం.  ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే.

నల్లధనం ఉన్నవారు జనధన యోజన ఖాతాల్లోకి నగదును తరలించే కన్నా.. ప్రభుత్వానికి తమ వద్దనున్న నల్లధనాన్ని లెక్క చెప్పేసి.. జరిమానాను కట్టేయాలన్న సూచన ఉండటం గమనార్హం.ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా.. జనధన యోజన ఖాతాల్లోకి నగదును బదిలీ చేయటం అంటే.. హుండీలో వేసినట్లేనన్న విషయాన్ని మోడీ స్పష్టం చేశారని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News