“ఫణి” పై నాట్యం చేసిన కాళింగులు

Update: 2019-05-04 05:33 GMT
కడలి కడుపున పుట్టిన ఓ భీకర కదలిక కరాళ కదనమై తీరంపై వైరం ప్రకటించి అలలను ఆయుధాలుగా, వానల్ని విచ్చుకత్తులుగా మార్చి విలయం సృష్టిస్తే నరమానవుడు శిరసొగ్గి నిలవాల్సిందే. ప్రకృతి ప్రకోపం ముందు మనిషి చేయగలిగిందేమీ లేదు. కానీ ముందస్తు సూచనతో, ముందస్తు సిద్ధతతో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. అత్యంత విలయకారకమైన తుఫాను ఫణి (బంగ్లాదేశ్ ఈ తుపానుకు పెట్టిన పేరు ఇది. బెంగాలీ భాషలో ఫణిని ఫొని అని చదువుతారు) లో ప్రాణనష్టాన్ని నివారించడంలో, ఆస్తి నష్టాన్ని తగ్గించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల ఈ సారి ప్రాణ నష్టం చాలా తగ్గింది. 1999 లో సూపర్ సైక్లోన్ ఇదే ఒడిశా తీరాన్ని తాకింది. అప్పుడు దాదాపు పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. అపార ఆస్తినష్టం జరిగింది. సరిగ్గా ఇరవై ఏళ్ల తరువాత ఈ సారి ఫణి పడగ విప్పింది.అదే ఉధృతి, అదే ఉన్మాదం. కానీ ప్రాణనష్టాన్ని పదుల సంఖ్యకు కూడా చేరకుండా నివారించగలిగారు. ఇందుకు పూర్తిసమన్వయంతో వ్యవహరించి, ముందు జాగ్రత్తగా దాదాపు పదిలక్షల మంది తీరప్రాంత నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి కోసం ముందస్తుగా తుపాను షెల్టర్లలో అవసరమైన పదార్థాలను నిలువ చేసి ఉంచి, సర్వ సన్నద్ధంగా ఉంచగలిగారు. తుపాను మతి గతులను, స్థితిగతులను ఎప్పటికప్పుడు సూచించే వాతావరణ కేంద్రాలు, సాటిలైట్ నిఘా కళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి సమన్వయం ఉండటం వల్ల తుపానులో ప్రాణనష్టాన్ని గణనీయంగా నివారించారు. ప్రభావిత గ్రామాలను ముందుగానే గుర్తించి, తక్షణం స్పందించే సహాయక బృందాలను మొహరించి, పునరావాస, పునర్మిర్మాణాల పనులు కూడా అంతే వేగంగా ప్రారంభం కాగలిగాయి. ఒడిశా సూపర్ సైక్లోన్ విలయం నుంచి పాఠాలు నేర్చుకున్నకారణంగానే ఇది సాధ్యమైంది. ప్రభుత్వాల మధ్య పూర్తి సమన్వయం వల్ల  ఇవి సాధ్యమయ్యాయి.

గతేడాది కేరళలో వరదల విధ్వంసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిన తీరుతో పోలిస్తే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రజా శ్రేయస్సుకే పెద్దపీట వేసింది. కేరళ వరదల సమయంలో ప్రాజెక్టు గేట్లన్నిటినీ ఒకే సారి ఎత్తివేయడం వల్ల కనీ వినీ ఎరుగని విధ్వంసం జరిగింది. ఇదంతా జరుగుతున్నా ఆపత్సమయంలోనూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం చొరవ చూపలేదు. ప్రజలకు సహాయం చేసేందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలను సైతం అధికారపార్టీ కార్యకర్తలు అడ్డుకున్న దాఖాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సీజన్ లోనూ రాజకీయాలను పక్కనబెట్టి ప్రజా శ్రేయస్సుకు పెద్దపీట వేసిన ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలను అభినందించాలి. అయితే ఈ సందర్భంగా కేరళ భౌగోళిక స్థితికి, ఒడిశా తీరప్రాంత భౌగోళిక పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఒడిశాలో ఉన్న సౌలభ్యాలు కేరళలో లేవన్నది వాస్తవం. కేరళలో కొండలు, లోయలున్న పశ్చిమ కనుమల్లో వరదల వల్ల విలయం సంభవించింది. ఒడిశా తీరప్రాంతంలో వందల సంఖ్యలో తుపాను షెల్టర్లు ఇప్పటికే ఉన్నాయి.

అయితే ప్రతి విలయం నుంచి పాలకులు, ప్రజలు, అధికార యంత్రాంగం పాఠాలు నేర్చుకోవాలి. వాటి స్వరూప స్వభావాలలో తేడా ఉన్నా యంత్రాంగం ప్రతిస్పందించే విధానం, జల ప్రళయాలకు ముందు, ఆ సమయంలో, ఆ తరువాత చేయాల్సిన పనుల విషయంలో స్పష్టతను పాటించగలిగేలా సంసిద్ధత ఉండాలి. ఒడిశా ఈ విషయంలో సూపర్ సైక్లోన్ మిగిల్చిన విషాదం నుంచి పాఠాలు నేర్చుకుంది. అందువల్లే ఈ సారి ప్రాణనష్టాన్ని నివారించగలిగింది. సహాయ పునరావాస, పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించగలిగింది.

ప్రకృతి విలయాన్ని తట్టుకునేందుకు, పడగానే లేచి నిలబడేందుకు, పరుగులు తీసేందుకు సంసిద్ధత, సమన్వయం చాలా అవసరం. ఈ దిశగా రాష్ట్రాలు పాఠాలు నేర్చుకుంటున్నాయనడానికి ఒడిశా ప్రభుత్వం చేపట్టిన చర్యలే నిదర్శనం. ఒడిశా ప్రభుత్వం రాజకీయాలకు పోకుండా, భేషజాలకు తావివ్వకుండా ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయడం అభినందనీయం.


    
    
    

Tags:    

Similar News