టీడీపీ ఎంపీపై తమ్ముడి హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

Update: 2023-01-18 07:30 GMT
ఆంధప్రదేశ్‌ లో విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా కేశినేని నాని గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కేశినేని నాని టీడీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఇప్పటికే కేశినాని నాని తేల్చిచెప్పారు. అయితే తన తమ్ముడు కేశినేని శివనాథ్‌ (చిన్ని), మరో ముగ్గురుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వొద్దని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ టీడీపీని ఒక సిద్ధాంతంతో ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఉమనైజర్లకు, కాల్‌మనీ లో ఉన్నవాళ్లకు టికెట్లు ఇవ్వవద్దన్నారు. వీరికి సీట్లు ఇస్తే తాను సహకరింబోనని కేశినేని నాని రెండు రోజుల క్రితం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న ఆవేశంతో మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కలసి పనిచేస్తామని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. తాను కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నానన్నారు.

ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలిపారు. పార్టీ కోసం శ్రమిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్‌ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని కేశినేని చిన్ని ధ్వజమెత్తారు.

కేశినేని నాని కామెంట్లపై స్పందించిన కేశినేని చిన్ని పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారికి సహకరిస్తానని స్పష్టం చేశారు. కేశినేని నానికి టికెట్‌ ఇచ్చినా తాను మద్దతు ఇస్తానని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నానికి తెర వెనుకుండి పని చేశానని.. ఆయన గెలుపు కోసం కృషి చేశానని గుర్తు చేశారు.

2019 ఎన్నికల్లో నానితో విబేధాల కారణంగా ఆయనతో పని చేయలేదన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదని తెలిపారు. కేశినేని నాని చేసిన కామెంట్లను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. సేవా కార్యక్రమాలు ఎవరు చేసినా మంచిదేనని తెలిపారు. అన్న క్యాంటీన్లల్లో పేదలు భోజనం చేస్తారు.. కానీ, డబ్బున్న వారు భోజనం చేస్తారా..? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. తన తమ్ముడి వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.      



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News