టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు రూ.50 లక్షల సుఫారీ, కీలక వ్యక్తి అరెస్ట్

Update: 2020-05-13 03:45 GMT
టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏవీని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి ఓ పిస్టల్, 6 బుల్లెట్లు, రూ.3.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు సూడో నక్సలైట్‌ గా గుర్తించారు. ఏవీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ హస్తం ఉందని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి.

ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిని అరెస్టు చేసి, అతని నుండి రెండు మొబైల్స్, ఓ వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భార్గవ్ పీఏ శ్రీనివాసులుగా అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి లావాదేవీలు చేయడంలో శ్రీనివాసులు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు రూ.50 లక్షలు సుఫారీ తీసుకున్నారట.

నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. భూమా ఫ్యామిలికీ, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. తనను హత్య చేసేందుకు భూమా ఫ్యామిలీ ప్రయత్నిస్తోందని గతంలో ఏవీ ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.
Tags:    

Similar News