మూడో దశ ఎన్నికల్లోనూ దాదాపు ముదుర్లే

Update: 2019-04-21 08:45 GMT
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఇవాళ మూడో దశ ఎన్నికలకు కూడా టైమ్‌ పూర్తి కాబోతుంది. ఎల్లుండే పోలింగ్‌. చివరి రోజు కావడంతో.. భారీగా ప్రచారం చేసేందుకు అన్ని ప్రధాన పార్టీలూ కేడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు 23న పోలింగ్ జరగబోతోంది. అయితే ఈసారి జరుగుతున్న మూడో దశ ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. అలాగే.. కేసులున్న వాళ్లు కూడా ఈ దఫా ఎన్నికల్లోనే బరిలోగి దిగుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ లోని రోహిల్ ఖండ్ ప్రాంతంలో 10 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచారం ముగియబోతోంది. ఈ పోలింగ్‌ లో కేంద్ర మంత్రి సంతోష్ కుమార్... బరేలీ నుంచీ బరిలో దిగుతున్నారు. ఇక సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. మెయిన్‌ పురి నుంచీ పోటీ చేస్తున్నారు. బీజేపీలో చేరిన జయప్రద రాంపూర్ నుంచీ పోటీ చేస్తుంటే... ఆమెకు దీటుగా ఎస్పీ నేత మహ్మద్ అజం ఖాన్ బరిలో ఉన్నారు. ఫిలిబిత్ నుంచీ వరుణ్ గాంధీ - ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్... ఫిరోజాబాద్ నుంచీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యూపీలో 20,116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా... 120 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఇక ఈ దఫా ఎన్నికల్లో చాలామంది నేరచరితులు బరిలో ఉన్నారు. గుజరాత్‌ లోని 26 లోక్‌ సభ స్థానాలకు పోటీ చేస్తున్న వారిలో 370 మందిలో ఏకంగా 58 మందిపై కేసులు నమోదై ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో వీళ్ల సంఖ్య 16 శాతానికి పైనే. 58 మందిలో 34 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. హత్య కేసులు - హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. గుజరాత్‌లో ఈనెల 23న తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. జునాగఢ్‌ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి అమృత్‌భాయ్ కరియాపై అతి ఎక్కువగా 11 సీరియస్ కేసులున్నాయి. ఆనంద్ నుంచి గెలుస్తానంటున్న బీజేపీ అభ్యర్థి మితేష్ పాటిల్‌పై 9 కేసులున్నాయి. రాజ్‌ కోట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పర్వీన్ డెంగడపై 6 తీవ్ర నేరాల కేసులున్నాయి. సురేందర్‌ నగర్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి భూపతి సోలంకిపై 6 కేసులు రికార్డై ఉన్నాయి. అహమ్మదాబాద్ తూర్పు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న గీతాబెన్ పటేల్‌ పై 5 కేసులున్నాయి. మొత్తానికి మూడో దశలో సీనియర్లు - అంతకుమించిన దేశముదుర్లు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Tags:    

Similar News