కిమ్ అమెరికాకే గురి పెట్టాడే!

Update: 2017-08-30 06:59 GMT
అమెరికా ఎంత హెచ్చరించినా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. తన దుందుడుకు వైఖరితో అగ్రరాజ్యాన్ని రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఇప్పటిదాకా మాటకు, మాట బదులిచ్చిన కిమ్‌ జాంగ్‌ ఈసారి ఏకంగా అమెరికా ఆధీనంలో ఉన్న భూభాగంపై  క్షిపణి ప్రయోగించి తన తెంపరితనాన్ని ప్రదర్శించాడు. జపాన్‌ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలోకి మధ్య తరహా శ్రేణి క్షిపణి (హస్వాంగ్‌-12)ని పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా - దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాల నేపథ్యంలో తాము ఈ పరీక్షను నిర్వహించినట్లు వెల్లడించింది.  ఈ క్షిపణి 550 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి.. 2700 కిలోమీటర్లు ప్రయాణించి.. జపాన్‌ దీవి హొకాయిడో మీదుగా దూసుకెళ్లినట్లు దక్షిణ కొరియా ధ్రువీకరించింది. గతంలో ఉత్తర కొరియా క్షిపణులేవీ ఇంత సుదూర లక్ష్యాలను ఛేదించలేదు. అలాగే... జపాన్‌ భూభాగం మీదుగా క్షిపణిని ప్రయోగించడం కూడా ఇదే మొదటిసారి.

రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌ నుంచి ఉత్తరకొరియా క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. పసిఫిక్‌ మహా సముద్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మరిన్ని క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది. ప్యాంగ్‌ యాంగ్‌ నుంచి ఈ పరీక్షను నిర్వహించాలని అధ్యక్షుడు కిమ్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. గ్వామ్‌ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకునే జపాన్‌ మీదుగా క్షిపణిని పరీక్షించామని వెల్లడించింది. హస్వాంగ్‌-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను గ్వామ్‌ ను సర్వనాశనం చేసేందుకు వినియోగిస్తామని, ఇందుకు వ్యూహం రచించామని గతంలో కిమ్‌.. అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే. కిమ్‌-ట్రంప్‌ల వాగ్యుద్ధం తర్వాత గ్వామ్‌ పై దాడిని ఉత్తరకొరియా విరమించుకుంది. ఈ నేపథ్యంలో తాజా క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా మళ్లీ వేడి రాజేసింది.

కొరియా యుద్ధం అనంతరం పసిఫిక్‌ మహా సముద్రంలో గల గ్వామ్‌ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ 1.60 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అమెరికాకు చెందిన నేవీ - ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ లు ఇక్కడున్నాయి. ఉత్తరకొరియా తాజా ప్రయోగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఉత్తరకొరియా ఎంత రెచ్చిపోతే అంతలా నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ఉత్తరకొరియాను ఒంటరి చేస్తాయని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కిమ్‌ దేశాన్ని కట్టడి చేసేందుకు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News