కోహ్లి ''వంద''లో వంద మిస్.. ఇంకో చాన్సుంటుందా?

Update: 2022-03-04 11:30 GMT
ఇప్పటి వరకు వంద టెస్టులాడిని భారత క్రికెటర్లు 11 మంది.  ఇందులో బౌలర్లను మినహాయిస్తే.. గావస్కర్ సహా సచిన్, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, వెంగ్సర్కార్ వంటి మేటి బ్యాట్స్ మెన్ ఎవరూ వంద కొట్టలేకపోయారు. ఆ అవకాశం శుక్రవారం విరాట్ కోహ్లీకి వచ్చింది. కానీ, ఈ మాజీ కెప్టెన్ దానిని అందుకోలేకపోయాడు. రెండేళ్ల పైగా కాలం నుంచి సెంచరీ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న కోహ్లి.. తన వందో టెస్టులోనూ చేరుకోలేకపోయాడు. మొహాలీలో శుక్రవారం శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (28 బంతుల్లో 29; 6 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (49 బంతుల్లో 33; 5 ఫోర్లు)  మంచి ఆరంభమే ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ దూకుడుగా ఆడాడు. మయాంక్ సంయమనం చూపాడు.

అబ్బా.. రోహిత్

కెప్టెన్ గా తొలి టెస్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్.. చక్కటి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు సౌకర్యంగానే కనిపించాడు. బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు. కానీ, తన బలం, బలహీనత కూడా అయిన హుక్-పుల్ షాట్ కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇప్పటికే పలుసార్లు రోహిత్ ఇలా అవుటయ్యాడు. ఈ బలహీనతను గమనించే అతడికి బౌలర్లు షార్ట్ బంతులు వేయడం.. ఆపుకోలేక వాటిని రోహిత్ పుల్ కు యత్నించడం.. ఫీల్డర్ కు క్యాచ్ ఇవ్వడం పరిపాటిగా మారింది. సారథ్య బాధ్యతలు మోస్తున్న నేపథ్యంలో రోహిత్ ఈ తప్పును సరిదిద్దుకోవాల్సి ఉంది. ఇక మయాంక్.. ఎంబుల్దెనియా స్పిన్ కు వికెట్ల ముందు చిక్కాడు. రివ్యూ కూడా అడక్కుండానే వెనుదిరిగాడు.

కోహ్లి కమాల్.. అయితే?

ప్రేక్షకుల అభిమాన కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి వచ్చిన వందో టెస్టు వీరుడు కోహ్లి, ఇన్నింగ్స్ ను మెరుగ్గా ఆరంభించాడు. చూడచక్కటి షాట్లు ఆడాడు. ఎదుర్కొన్న రెండో బంతినే ఎక్స్ ట్రా కవర్ వైపు గాల్లోకి లేపిన కోహ్లి అక్కడ ఫీల్డర్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత మాత్రం సాధికారికంగా ఆడాడు. ఎక్కడా ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. మంచి టైమింగ్ తో బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో 38 పరుగుల మార్క్ ను చేరుకోగాలనే టెస్టుల్ల 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని చేరిన ఆరో భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. సచిన్ (15921), ద్రవిడ్ (13,265) గావస్కర్ (10,122), లక్ష్మణ్ (8,781), సెహ్వాగ్ (8,503) అతడి కంటే ముందున్నారు.

వంద కొట్టేస్తాడునుకుంటే ఉసూరుమనిపించాడు..

పరుగులు సులభంగా సాధిస్తూ.. మంచి టచ్ తో, ఆత్మవిశ్వాసంతో కనిపించిన కోహ్లి వందో టెస్టులో వంద కొట్టేలా కనిపించాడు. తద్వరా 71 ఇన్నింగ్స్ ల తర్వాత మూడంకెల స్కోరును చేరుకునేలా కనిపించాడు. కానీ, అనూహ్యంగా బౌల్డయి నిరాశపరిచాడు. అప్పటిదాకా ఫ్రంట్ ఫుట్ పై ఆడిన కోహ్లి.. ఎంబుల్దెనియా బౌలింగ్ లో బ్యాక్ ఫుట్ పై ఆడబోయి బౌల్డయ్యాడు. స్ట్రయిట్ గా వస్తున్న ఫుల్లర్ లెంగ్త్ బంతిని వెనక్కు జరిగి ఆడబోయి వికెట్ ఇచ్చేశాడు. అయితే, హైదరాబాదీ బ్యాట్స్ మన్ హనుమ విహారి (128 బంతుల్లో 58, 5 ఫోర్లు) తో కలిసి మూడో వికెట్ కు 90 పరుగులు జోడించిన కోహ్లి జట్టను మెరుగైన స్థితిలో నిలిపాడు. కోహ్లి వందో టెస్టులో వందకు మరో చాన్సుంది. అయితే, అది ఈ టెస్టులో టీమిండియా రెండోసారి బ్యాటింగ్ కు దిగితేనే..?
Tags:    

Similar News