గవర్నర్ కిరణ్ బేడీ ఎమ్మెల్యే కాళ్లకు మొక్కి షాకిచ్చారు

Update: 2016-06-07 17:08 GMT
వ్యక్తిపూజ ఎక్కువగా ఉండే చోట.. అందుకు భిన్నంగా వ్యవహరించి కార్యక్రమానికి వచ్చిన వారందరికి షాకిచ్చారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ. నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచే పేరున్న ఆమె.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన మార్క్ నిర్ణయాలతో వ్యవహరిస్తున్న ఆమె.. తాజాగా ఆమె వ్యవహార శైలి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల పుదుచ్చేరి ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పుదుచ్చేరి ఎమ్మెల్యేలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు వచ్చి అభినందనలు తెలిపారు. అక్కడితో ఆగని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయవేణి గవర్నర్ హోదాలో ఉన్న కిరణ్ బేడికి శాలువా కప్పి పాదాభివందనం చేశారు. మామూలుగా అయితే ఇలాంటి వాటికి పెద్దగా స్పందించని వైనం చాలామంది పెద్దల్లో చూస్తాం. అందుకు భిన్నంగా ఇలా కాళ్లు పట్టుకోవటం వద్దని వారించిన కిరణ్ బేడీ..ఆత్మగౌరవంతో బతకాలని.. ఎవరి కాళ్లు పట్టుకోకూడదన్న ఉపదేశం ఇచ్చిన ఆమె.. సదరు ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు.

ఊహించని ఈ పరిణామానికి సదరు ఎమ్మెల్యేతో సహా కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్ తిన్న పరిస్థితి. లెఫ్టినెంట్ హోదాలో ఉన్న కిరణ్ బేడీ స్వయంగా తన కాళ్లకు మొక్కటాన్ని సదరు ఎమ్మెల్యే జీర్ణించుకులేని పరిస్థితి. వీఐపీలు.. రాజకీయ నేతల కార్లకు సైరన్లు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేయటంతో పాటు.. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన కిరణ్ బేడీ తీరు ఇప్పుడా బుజ్జి కేంద్రప్రాలిత ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News