టీడీపీ గూటికి మాజీ సీఎం త‌మ్ముడు

Update: 2015-09-29 07:47 GMT
తెలుగుదేశం పార్టీలో చేరిక‌ల జోరు కొనసాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీలు - త‌ట‌స్థులు అనే తేడాలేకుండా సైకిల్ ఎక్కుతున్న నాయ‌కుల‌కు తోడు మ‌రో కీల‌క నాయ‌కుడు ప‌చ్చ కండువా క‌ప్పుకోనున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌మ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి త్వ‌ర‌లో తెలుగుదేశం గూటికి చేర‌నున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ చివ‌రి ముఖ్యమంత్రిగా ఉన్న‌ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను విడ‌దీసిన తీరును నిర‌సిస్తూ సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఈ పార్టీ త‌ర‌ఫున సొంత‌ తమ్ముడు న‌ల్లారి కిశోర్‌ కుమార్ రెడ్డిని త‌ను గ‌త ఎన్నిక‌ల్లో నిలిచిన పీలేరు స్థానం నుంచి నిల‌బెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చేతిలో కిశోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు.

అనంత‌రం స్త‌బ్దుగా ఉన్న కిశోర్‌ కుమార్ రెడ్డి ఇపుడు తెలుగుదేశం గూటికి చేర‌నున్న‌ట్లు స‌మాచారం. కిశోర్‌ కుమార్ రెడ్డి ఈ మేర‌కు ఆస‌క్తిచూపించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. రాబోయే ఎన్నిక‌ల్లో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున కిశోర్‌ కుమార్ రెడ్డిని బ‌రిలోకి దించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కిర‌ణ్ కుమార్ రెడ్డి కంటే ముందే ఆయ‌న సోద‌రుడు కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News