జ‌గ‌న్ కాబినెట్ లో NNN స్పెష‌ల్!

Update: 2019-06-08 05:53 GMT
ఒక ముఖ్యమంత్రి జ‌ట్టులో ఒకే పేరు మీద ఇద్ద‌రు మంత్రులు ఉండ‌టం అరుదు. అలాంటిది ఏకంగా ముగ్గురు ఉండ‌టం ఆస‌క్తిక‌ర‌కంగా చెప్పాలి. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌ట్టులో ఒకే పేరున్న మంత్రులు ముగ్గురున్నారు. పాతిక మంది మంత్రుల‌తో ఫుల్ జ‌ట్టులో కొలువు తీర‌నున్న కాబినెట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌న‌కు అత్యంత స‌న్నిహితుల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ మంత్రివ‌ర్గాన్ని కూర్చిన జ‌గ‌న్ తీరుపై జోరుగా చ‌ర్చ సాగుతోంది.

మంత్రివ‌ర్గంలో ముగ్గురు మంత్రుల పేర్లు ఒకటే కావ‌టం ఒక విశేషంగా చెప్పాలి. వారే.. కొడాలి నాని.. పేర్ని నాని.. ఆళ్ల నాని.  ముగ్గురు నానిల‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌టం ఒక అంశ‌మైతే.. ఆ ముగ్గురిలో ఇద్ద‌రు కృష్ణా జిల్లాకు చెందిన వారు కావ‌టం మ‌రో ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి.

జ‌గ‌న్ జ‌ట్టులో ట్రిపుల్ "N" గా మారిన ముగ్గురు నేత‌ల బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగోసారి గెలిచారు. జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. 2004.. 2009 రెండు సార్లు టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిస్తే.. 2014లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన విజ‌యం సాధించారు. దూకుడు ఎక్కువ‌గా ఉండే నాని.. టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌టంలో ముందుంటారు.

జ‌గ‌న్ జ‌ట్టులో మ‌రో నానిగా ఆళ్ల నానిని చెప్పొచ్చు. తాజా ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆయ‌న‌.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దిగి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. 2004.. 2009.. 2014 వ‌రుస ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంటున్న ఆయ‌న‌కు సంబంధించిన ఒకే ఒక్క అంశం ఏమంటే.. గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లో ఆయ‌న మెజార్టీ మొద‌టిసారి కంటే రెండో సారి ఎక్కువ‌గా ఉంటే.. మూడోసారి మాత్రం మొద‌టిసారి వ‌చ్చిన దాని కంటే త‌క్కువ‌గా ఉండ‌టం.

జ‌గ‌న్ జ‌ట్టులో మూడో నానిగా కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పేర్ని నానిగా చెప్పాలి. ఆయ‌న అస‌లు పేరు పేర్ని వెంక‌ట రామ‌య్య అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న్ను నానిగా పిలుస్తుంటారు. 1999లో కాంగ్రెస్ త‌ర‌ఫున బంద‌రు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓట‌మిపాలైన ఆయ‌న తొలిసారి 2004లో విజ‌యం సాధించారు. 2009లో కాంగ్రెస్  ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌.. 2011లో కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ విప్ గా ప‌ని చేశారు. 2013లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు.


Tags:    

Similar News