పకోడీ ట్వీట్లు మాని తెలుగు నేర్చుకోవయ్యా లోకేశా..!

Update: 2018-10-27 17:35 GMT
అపారమైన భాషాపరిజ్ఞానంతో ఎన్టీ రామారావు తెలుగుకు పట్టం కట్టగా ఆయన స్థాపించిన పార్టీకే చెందిన నారా లోకేశ్ తెలుగు భాషకు సమాధి కట్టేస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. లోకేశ్ తెలుగు అలా ఉంటుంది మరి. తెలుగుదేశం నేతలు లోకేశ్ తెలుగును కష్టపడి భరిస్తున్నా రాష్ట్ర ప్రజలు మాత్రం భరించలేకపోతున్నారు. ఆయన మైకు పట్టుకుని మాట్లాడినా - తెలుగులో ట్వీటుచేసినా అందులో ఏదో ఒక తప్పు ఉండడం ఖాయమన్న ముద్ర పడిపోయింది. అందుకే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా లోకేశ్‌ కు ఒక సలహా ఇచ్చారు. తెలుగును ఖూనీ చేయడం మానేసి తెలుగు నేర్చుకోవయ్యా లోకేశ్ అంటూ ఆయన ట్విటర్ సాక్షిగా మందలించారు.
   
ట్విటర్‌ లో యాక్టివ్‌ గా ఉండే నారా లోకేశ్‌ రీసెంటుగా చేసిన ట్వీట్లపై ఆయన మండిపడ్డారు.  ఈ పకోడీ ట్వీట్లు వేయడం మానేసి.. తొలుత తెలుగు నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం అనంతరం తొలుత దాడిని ఖండిస్తూ ట్వీట్‌ చేసిన నారా లోకేశ్‌.. సాయంత్రానికే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలతో మేలుకున్న లోకేశ్‌.. ఈ దాడి గురించి ప్రస్తావిస్తూ వరుస ట్వీట్ల్‌ పెట్టారు. దీంతో కొడాలి స్పందించారు... #ShamelessTDP అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో లోకేశ్ ట్వీట్లకు ఘాటైన కౌంటర్లేశారు.
   
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేక, నాన్నారు నామినేట్ చేస్తే ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి అందుకున్న నువ్వు  గెలుపు-ఓటముల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కొడాలి అన్నారు. ‘అధికారం కోసం పొత్తులు,అవసరం తీరాక నిందలు వేయటం మీకు ఏమాత్రం కొత్తకాదు. రాష్ట్రప్రజలను మరోసారి మభ్య పెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం’  అని లోకేశ్‌ ట్వీట్లను తిప్పికొట్టారు. లోకేశ్ ట్వీట్లలోని తప్పులను ఎత్తిచూపిన కొడాలి ముందు తెలుగు నేర్చుకుని ఆ తరువాత ట్వీట్లు చేస్తే బాగుంటుందని సూచించారు.
Tags:    

Similar News