'విడిపోవద్దు..విలీనం చేసేయండి’..బాబుకు సలహా

Update: 2018-02-21 16:38 GMT
బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు అంతంతమాత్రమై.. రెండింటి మధ్య పొత్తు కొనసాగుతుందా.. తెగిపోతుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్న వేళ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక సూచన చేశారు. బీజేపీతో విడిపోవద్దని.. టీడీపీని ఆ పార్టీలో విలీనం చేసేయమని ఆయన సూచించారు.
    
కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీని బీజేపీతో విలీనం చేసేస్తే మంచిదని ఆయన అన్నారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్తనాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన కుట్రలు - కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టినవిద్య అని - ఆయన చెప్పేదొకటి - చేసేదొకటి. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ తర్వాత కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారని ఆయన అన్నారు.
    
 ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటనతో చంద్రబాబుకు దిమ్మతిరిగిందని.. ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో ఆయన పవన్ కల్యాణ్‌ను సీన్లోకి తెచ్చారని అన్నారు. పవన్ తో రోజుకో  ప్రకటనలు చేయిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బాబుకు కావాల్సిందల్లా అధికారమని.. అందుకోసం ఆయన ఎంతకైనా దిగజారుతారని అన్నారు. టీడీపీ - బీజేపీలకు కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News