భూకుంభ‌కోణంలో కేకేను బుక్ చేసింది ప్ర‌భుత్వ‌మే!

Update: 2017-06-12 06:08 GMT
తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న భూ కుంభ‌కోణంపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ భూ కుంభకోణంలో టీఆర్‌ ఎస్ నేత - రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పేరు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై కోదండ‌రాం ఆస‌క్తిక‌ర‌మైన అనుమానం లేవ‌నెత్తారు.  ప్రభుత్వంలోని కొందరు పెద్దలు భూ కుంభకోణంలో ఉన్నారని ఆయన ఆరోపించారు. భూకుంభ‌కోణంలో కేకే పేరును ప్రభుత్వమే ‘లీక్’ చేసిందని కోదండ‌రాం అనుమానం వ్యక్తం చేశారు. ఆ విధంగా ఎందుకు చేస్తుందని ప్రశ్నించగా, ‘ఏమి కోపం ఉండెనో..’ అని కోదండ‌రాం న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం  నిర్వ‌హించిన అనంత‌రం ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ వెలుగు చూస్తున్న సుమారు 10 వేల కోట్ల విలువ గల భూ కుంభకోణాలపై సిట్టింగ్  జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ కేకే భూ కుంభకోణాన్ని కూడా ప్రభుత్వమే మీడియాకు లీక్ ఇచ్చిందన్నారు.  భూ కుంభకోణాలపై మీడియా ద్వారానే స్పందిస్తారా? అని ప్రశ్నించగా, దీనిపై తాము అడ్వకేట్స్ జేఏసీతో మాట్లాడి, త్వరలో రౌండ్‌ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి, ఆ తర్వాత కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని కోదండ‌రాం తెలిపారు. ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన లేదన్నారు. ప్రభుత్వం కుళ్లిపోయి, కంపుకొడుతున్నదని కోదండ‌రాం విమర్శించారు.

గ్రూప్ 2 పరీక్షా ఫలితాలపై అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోదండ‌రాం డిమాండ్ చేశారు. ఎస్సై పరీక్షా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు.  రైతులకు నాలుగో విడత రుణ మాఫీ పూర్తిగా చేయాలని, కొన్ని బ్యాంకులకు ఇంకా వడ్డీ కూడా చెల్లించలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 21న ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రోజున ‘అమరవీరుల స్ఫూర్తి యాత్ర’ చేపట్టనున్నట్లు కోదండరాం తెలిపారు. ఈ యాత్ర 24న సిద్దిపేటలో ముగుస్తుందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై, ఇంకా వివిధ అంశాలు, ప్రజా సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News