కేసీఆర్ పై ఇది కోదండ విజయం!

Update: 2017-11-12 11:03 GMT
ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు, ఆయన ప్రభుత్వం తీసుకునే  నిర్ణయాలకు వ్యతిరేకంగా  కోర్టు తీర్పులు రావడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయిన విషయం. గతంలో కూడా చాలా వ్యవహారాల్లో తెలంగాణ సర్కారు దూకుడుకు కోర్టు ముకుతాడు వేసింది. అనేక నిర్ణయాలను ప్రభుత్వం తిరిగి సమీక్షించుకునేలా ప్రతికూల తీర్పులు ఇచ్చింది. అయినా ప్రభుత్వం వ్యవహరించే దూకుడులో మాత్రం ఇసుమంతైనా స్పీడు తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ కోదండరాం  - కేసీఆర్ సర్కారు వ్యవహార శైలి మీద మరో మారు కోర్టు ద్వారా విజయం సాధించారు. కొలువులకై కొట్లాట పేరుతో చేపట్టదలచుకున్న ఉద్యమానికి కోర్టు ద్వారా అనుమతి సంపాదించారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో పరిశీలించినప్పుడు.. ఈ కోర్టు తీర్పు చాలా స్పష్టంగా.. కేసీఆర్ మీద కోదండవిజయంగా కనిపిస్తుంది.

తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వినిపించే నిరసన గళాలను, ఉద్యమాలను అణచివేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకేరీతిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. చాలా అంశాల్లో మాదిరిగానే ఇద్దరు ముఖ్యమంత్రులూ పోటాపోటీగా నిరసన గళాలను అణిచేస్తుంటారు. అదే క్రమంలో ప్రొఫెసర్ కోదండరాం చేపట్టదలచిన ఉద్యమాన్ని - కొలువులకోసం కొట్లాట కార్యక్రమాన్ని తొక్కేయాలని కేసీఆర్ సర్కారు డిసైడైంది. పోలీసులు తన సభకు అనుమతి నిరాకరించే సరికి.. కోదండరాం ఊరుకోలేదు. తన డిమాండులో బలం ఉన్నదని భావించిన ఆయన కోర్టును ఆశ్రయించారు.

ఒక్క వేదిక కాదు.. జంటనగరాల పరిధిలో అనేక మైదానాలను తన పిటిషన్లోనే సూచిస్తూ ఎక్కడో ఒకచోట కొలువులకోసం కొట్లాట సభను నిర్వహించుకునే ఏర్పాటు కల్పించాల్సిందిగా ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారనే విషయంలో ప్రభుత్వ వాదన వీగిపోయింది. కోదండరాంకు అనుమతి లభించింది.

ఇతరత్రా కారణాలను మనసులో ఉంచుకుని కేసీఆర్  సర్కారు తీసుకునే అనేకానేక నిర్ణయాలు కోర్టు వద్ద బెడిసి కొడుతున్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా కేవలం ఒకటి అనుకోవడానికి వీల్లేదు. ఇది కేసీఆర్ మీద ఆయన శత్రువు.. కోదండరాం సాధించిన విజయంగా అనుకోవాలి. ఇలాంటి ఎదురుదెబ్బలు మళ్లీ మళ్లీ తగలకుండా.. జాగ్రత్తలు తీసుకుంటే వారికే మంచిది.
Tags:    

Similar News