నేను సక్సెస్, జిల్లాల నుంచి నరుక్కొస్తా:మాస్టారు

Update: 2017-02-26 05:13 GMT
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం త‌న కార్య‌చ‌ర‌ణ‌కు మ‌రింత ప‌దును పెడుతున్నారు.  నిరుద్యోగ నిరసన ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా భగ్నం చేసినప్పటికీ, తాము ఓడిపోలేదని, ద్విగుణీకృత ఉత్సాహంతో మరింత దూసుకుని వెళ్ళాలని తెలంగాణ జేఏసీ ర‌థ‌సార‌థి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల్లోనూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ, వారికి చేరువ కావాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసిన స‌ద‌స్సు విష‌యంలో అనుమ‌తి ఆంక్ష‌లు విధించ‌డం - ఇక్క‌డికి వ‌చ్చే వారిని అడ్డుకున్న నేప‌థ్యంలో జిల్లాల్లోనే పెద్ద ఎత్తున త‌మ కార్య‌క‌లాపాలు సాగించాల‌ని డిసైడ‌య్యారు.

జేఏసీ చైర్మ‌న్ కోదండ రాం నివాసంలో ఆయ‌న అధ్యక్షతన ముఖ్య‌నేత‌ల సమావేశం జరిగింది. ఈ నెల 22న నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై ఈ సమావేశంలో ఆత్మావలోకనం చేసుకున్నారు. తాము చేసిన తప్పులేమిటీ? ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించడం, లోపాలను సవరించుకుని ముందుకు వెళ్ళడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసినప్పటికీ జరిగిన నష్టమేమీ లేదని, తెలంగాణ మారుమూల గ్రామం వరకూ ప్రభుత్వ నిరంకుశ విధానం గురించి ప్రజలకు అర్థమైందని ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. అందుకే మ‌రిన్ని అంశాల‌ను ప్ర‌జ‌ల దృష్టికి చేర‌వేసేలా కార్య‌క్ర‌మాలు ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకోసం  ఈ నెల 27న నిరుద్యోగ సమస్యపై విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మైనార్టీల సమస్యలపై సుధీర్ కమిషన్ చేసిన సిఫార్సులపై జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 1న మహబూబ్‌నగర్ - 4న నిజామాబాద్ - 11న వరంగల్‌ లో సదస్సులు నిర్వహించాలని - 12న జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలాఉండగా జేఏసీ నాయకుడు పిట్టల రవీందర్‌ పై కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారని స‌మాచారం. పిట్టలను జేఏసీ నుంచి బహిష్కరించాలన్న వారి డిమాండ్‌ కు కోదండరాం స్పందిస్తూ అది పిట్టల విజ్ఞతకే వదిలి వేద్దామని అన్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News